భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను విద్యాశాఖ అధికారులు నీరు గార్చడాన్ని నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. విద్యాశాఖ తీసుకొచ్చిన జీవో నం.2 వల్ల పదేళ్లుగా పదోన్నతులు పొందలేకపోతున్నామని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు.
జీవోలో అడెక్వసీ అనే పదాన్ని చూపెడుతూ... ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను అన్యాయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రమోషన్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించినా... జీవో నం.2 ను చూపిస్తూ మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు.