షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించే ఉత్తర్వును సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వును కొట్టివేసిన నేపథ్యంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. తీర్పుపై సమగ్ర రివ్యూ పిటిషన్ వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
'గిరిజన హక్కులు కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం' - SUPREM COURT ON TRIBALS
గిరిజన హక్కులు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించే ఉత్తర్వు కొట్టివేతపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సీఎం ఆదేశాల మేరకు పక్కా ప్రణాళికతో కసరత్తు చేసి త్వరలోనే పిటిషన్ వేస్తామని మంత్రి తెలిపారు. న్యాయనిపుణులు, ప్రజాప్రతినిధులు, గిరిజన ముఖ్యుల సలహా తీసుకుని పిటిషన్ తయారు చేస్తున్నామని, సంబంధం ఉన్న వర్గాల వారీ అభిప్రాయం సేకరిస్తామన్నారు. గిరిజనుల హక్కులను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదన్నారు.
గిరిజనుల హక్కులను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కేంద్రమంత్రి అర్జున్ ముండాను ఇప్పటికే కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని గిరిజనులు ఎవరూ ఆందోళన చెందవద్దన్న మంత్రి... గిరిజనుల హక్కులు, ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం కేసిఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు.