తెలంగాణ

telangana

ETV Bharat / state

సత్యనారాయణ శాస్త్రి.. పేదల ఆకలి తీర్చే ఆపద్భంధువు - అన్నార్తుల ఆకలి తీరుస్తున్న మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి.

కొవిడ్ కష్టకాలంలో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అనేక స్వచ్చంద సంస్థలు , మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. ఈ కోవలోనే ఓ పూజారి సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తాలో ఏడాది నుంచి నిత్యం ఆహార వితరణ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. రోజుకు 5 వేల మందికి నాణ్యమైన ఆహారం వడ్డిస్తూ ఆకలి బాధ తీరుస్తున్నారు. ఆయనే కానాజిగూడలోని మరకత శ్రీలక్ష్మిగణపతి ఆలయ వ్యవస్థాపకులు మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి.

satyanarayana sashtri food distribution
సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తాలో ఏడాది నుంచి నిత్యన్నదానం

By

Published : May 24, 2021, 10:28 AM IST

సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తాలో ఏడాది నుంచి నిత్యన్నదానం

హైదరాబాద్ మహానగరం దేశ నలుమూలల నుంచి ఎవరొచ్చినా కడుపులో పెట్టుకొని కాపాడుకునే భాగ్యనగరం. కొద్ది సంపాదన వచ్చే పేదోడి నుంచి అత్యధికంగా సంపాదించే ధనవంతుడి వరకు హాయిగా బతికేయవచ్చు. నగరంలో ఏ మూలకు వెళ్లినా పట్టడన్నం దొరకక మానదు. సాధారణ రోజుల్లోనే కాకుండా కరోనా కష్టకాలంలోనూ ఆకలికేకలు వినిపించకుండా చేస్తున్నారు కొంతమంది మానవతావాదులు. వ్యక్తిగతంగా, స్వచ్చంద సంస్థల పేరుతో అభాగ్యుల ఆకలి తీరుస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ కానాజిగూడలోని మరకత శ్రీలక్ష్మిగణపతి ఆలయ వ్యవస్థాపకులు మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి తనవంతు సామాజిక బాధ్యతగా ఏడాది కాలం నుంచి ఆహార వితరణ చేస్తున్నారు.


పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఈ తరుణంలో తానూ భాగస్వామ్యం కావాలని సంకల్పించారు. మరకత శ్రీలక్ష్మిగణపతి అన్నప్రసాదం ట్రస్టు ద్వారా గోపాలపురం పోలీసుల అనుమతితో చిలుకలగూడ చౌరస్తా వద్ద ఏడాది నుంచి వందలాది మందికి ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. 300 మందితో మొదలైన ఆహార యజ్ఞం క్రమంగా రోజుకు 5 వేల మందికి 10 రకాల రుచికరమైన వంటకాలతో నాణ్యమైన భోజనం అందించే స్థాయికి చేరింది. రోజువారీ కూలీలు, కార్మికులు, ప్రయాణికులు, అభాగ్యులు ,మానసిక రోగులు ఇలా 11 గంటల్లోపే చక్కటి పౌష్టికారహారాన్ని అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

మరకత శ్రీలక్ష్మిగణపతి ఆలయ నిర్మాణం

నల్గొండ జిల్లా మోత్కురు మండలం బుజిలాపురానికి చెందిన సత్యనారాయణశాస్త్రి.. గ్రామంలోని పొలాలన్నీ విక్రయించి ఆ డబ్బుతో సికింద్రాబాద్ కానాజిగూడ మరకత శ్రీ లక్ష్మిగణపతి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత తండ్రి రామశాస్త్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు విద్య, వైద్యాన్ని అందిస్తూ ఆదుకుంటున్నారు. కరోనా, లాక్‌డౌన్‌తో ఎంతోమంది ఆకలి బాధలను చూసి చలించిన సత్యనారాయణశాస్త్రి ఆహార వితరణకు పూనుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ సత్యనారాయణ శాస్త్రి కుమార్తె డాక్టర్ శ్రియా కౌముది పర్యవేక్షిస్తున్నారు. వైద్యవిద్యను పూర్తి చేసిన కౌముది తండ్రి తగ్గ తనయురాలిగా అభాగ్యుల ఆకలి తీరుస్తోంది.

ఆహారంతో పేదల కడుపునింపుతున్న సత్యనారాయణశాస్త్రి త్వరలోనే కీసర సమీపంలో పదెకరాల్లో కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మహత్కార్యానికి దాతలెవరైనా స్పందించాలని సత్యనారాయణశాస్త్రి, అన్నప్రసాదం ట్రస్టు డైరెక్టర్ డాక్టర్‌ శ్రియా కౌముది కోరుతున్నారు.


ఇదీ చూడండి:రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

ABOUT THE AUTHOR

...view details