హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ట్రాఫిక్ తిప్పలు.. ఎల్బీనగర్ బస్టాప్ నుంచి నుంచి రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికులు నల్గొండ, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. 600 నుంచి 700 వరకు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు వెళ్తుంటాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రారంభించిన పైవంతెనపై నుంచి వచ్చే వాహనాలూ బస్సులు ఆగే చోటే దిగుతున్నాయి. దీంతో రద్దీ మరింత పెరిగింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఈ సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అధునాతన శాటిలైట్ బస్ టెర్మినల్‌ను ప్రతిపాదించారు.
సమస్యలు తలెత్తకుండా.. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు హరిణ వనస్థలి జింకల పార్కుకు సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని అనువైందిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుని గణేష్ విగ్రహాలను తయారు చేసే వారితో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ అధికారులు మాట్లాడి ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించారు. 1.2 కి.మీ. విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి డిజైన్లను రూపొందించారు. వచ్చే నెలలోనే పనులు మొదలు పెట్టాలని భావించారు.