తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్పంచులు మేల్కోండి.. సీఎం కేసీఆర్‌పై తెగించి కొట్లాడుదాం' - కోదండరాం తాజా వార్తలు

Round Table Meeting on Sarpanchs Problems: తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట సవరణపై... రాష్ట్ర సర్పంచుల సంఘం, పంచాయతీ రాజ్ ఛాంబర్ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని హైదరాబాద్​లో నిర్వహించింది. సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న సీఎం కేసీఆర్ వైఖరిపై సమావేశంలో పాల్గొన్న నాయకులు మండిపడ్డారు. కోట్ల రూపాయలకు పడగెత్తిన బలమైన వ్యక్తిని ఢీకొనాలంటే... సర్పంచ్‌లందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Round Table Meeting
Round Table Meeting

By

Published : Jan 25, 2023, 10:01 PM IST

Round Table Meeting on Sarpanchs Problems: బలమైన ఉద్యమంతోనే గ్రామ పంచాయతీ వ్యవస్థను కాపాడుకోగలమని... ఆ దిశగా సర్పంచులు పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. భయపడకుండా ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ అడుగు వేయడం తమ చేతుల్లోనే ఉందని... సర్పంచ్‌ల సంఘాన్ని ఉద్దేశించి పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీలకు అధికారం ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచించి 73, 74 సవరణలతో చట్టబద్ధం చేయాలని అప్పట్లో నిర్ణయించారని తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణపై... హైదరాబాద్ లక్డికపూల్‌లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని తెలంగాణ సర్పంచుల సంఘం, తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ నిర్వహించింది.

అన్నింటికి తెగించి పోరాటానికి సిద్ధం కావాలి:సర్పంచులుగా లక్షలు పెట్టి పోటీ చేయడం ప్రశ్నార్థకంగా ఉందన్న కోదండరాం.. ఎన్నటికైనా మారుతుందన్న ఆశతో ఇంకా రంగంలోకి దిగుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర, గ్రామ పంచాయతీల మధ్య వైరుధ్యం పెరిగిందని... పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలు ఉన్నా అవేవీ పనికి రాని తీరు ఉందన్నారు. సీఎం కేసీఆర్ కోట్ల రూపాయల కుప్ప మీద కూర్చున్నారన్న ఆయన.. అధికారం పోతే తట్టుకోలేరన్నారు. వీటి అన్నింటికి తెగించి పోరాటానికి సిద్ధం కావాలని తమ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని ఆచార్య కోదండరాం సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు.

సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు: మొక్క ఎండితే సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తున్నపుడు... సీఎం నాటిన మొక్క విషయంలో ఏం చేయాలో ఆయనే చెప్పాలని పంచాయతీ రాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీడీపీ నేత యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలంగాణలో పంచాయతీ రాజ్ కాకుండా ఎమ్మెల్యే రాజ్​గా కనిపిస్తోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చేసిన చట్టం చెల్లదన్నారు. సర్పంచ్‌ల, పంచాయతీల నిధులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వారి స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ... సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడ్డారు.

ప్రధాని డబ్బులు వేస్తే సీఎం దొంగతనం చేశారు: దేశంలో పంచాయతీ రాజ్, సర్పంచ్‌ల పవర్ తగ్గకుండా ఉండేందుకు... 1992లో కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తమది రూలింగ్ కాదని... సర్వింగ్ ప్రభుత్వమని చెప్పిన సీఎం కేసీఆర్ అందుకు విరుద్ధంగా తయారయ్యారని పేర్కొన్నారు. ప్రధాని డబ్బులు వేస్తే సీఎం దొంగతనం చేశారని కొండా ఆరోపించారు. సర్పంచ్‌లకు సంబంధించిన ఐదు అంశాలను పార్టీలో చర్చించి... దిల్లీకి తీసుకెళ్తామని కొండా హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా... స్వప్రయోజనాల కోసం కాకుండా సర్పంచ్‌ల హక్కుల సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సర్పంచ్‌లు చేస్తున్న పోరాటానికి అధికార పార్టీ మినహా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details