'జాయింట్ చెక్‌పవర్ దేశంలో ఎక్కడా లేదు' హైదరాబాద్‌లోని కాచిగూడలో సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో తమ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భాజపా నేత డీకే అరుణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, లోక్‌సత్తా నుంచి నరసింహరెడ్డి హాజరయ్యారు. జాయింట్ చెక్‌పవర్ రద్దు చేయాలని, గ్రామపంచాయతీకి నేరుగా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు భూమన్న యాదవ్ కోరారు. సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తామనే బెదిరింపు చర్యలు మానుకోవాలన్నారు. సర్పంచ్ గౌరవవేతనం రూ. ఐదు వేల నుంచి 20 వేల వరకు పెంచాలని, ఏకగ్రీవంగా ఎన్నికైన 2,134 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి ఘోరంగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని జాయింట్ చెక్‌పవర్ మన రాష్ట్రంలో ఉండడం కెసీఆర్ ఘనతేనని ఎద్దేవా చేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం వల్ల భేదాభిప్రాయాలు వచ్చి ఏ విధమైన పనులు జరగవన్నారు భాజపా నేత డీకే అరుణ. నేటి పంచాయతీ వ్యవస్థలో గ్రామంలో కుక్క చచ్చిన, కోతి చచ్చిన, మొక్క చచ్చిన సర్పంచ్‌లదే బాధ్యత అనే తీరు.. సరికాదని తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు జవాబుదారిగా ఉంటారని.. అలా కాకుండా పంచాయతీ అధికారాలు మొత్తం కలెక్టర్‌కు అప్పజెప్పడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని.. లేకుంటే తమ కార్యాచరణను అక్టోబర్ 2 నుంచి ఉద్ధృతం చేస్తామని సర్పంచ్ల సంఘం హెచ్చరించింది.