Saroornagar Apsara Murder Case Updates :రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అప్సర హత్య కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. తనను పెళ్లిచేసుకోవాలంటూ ఒత్తిడి చేసిన అప్సర అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్న సాయికృష్ణ.. ఈ నెల 4వ తేదీ ఉదయం 3.30 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలోని నర్కుడలో ఆమెను హతమార్చాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్‌లోని సెప్టిక్ ట్యాంకులో వేసి కాంక్రీటుతో శాశ్వతంగా మూయించాడు. అప్సర ఏమైందంటూ సాయికృష్ణని ఆమె తల్లి ప్రశ్నించగా.. స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని చెప్పాడు.
Saroornagar Apsara Murder News :రెండు రోజులైనా అప్సర ఆచూకీ లేకపోవడంతో తల్లికి తనపై అనుమానం రాకుండా 5వ తేదిన ఉదయం 11 గంటలకు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ ఫిర్యాదు చేశాడు. రాత్రి 10.20 గంటలకు అప్సరను శంషాబాద్ బస్టాండు దగ్గర ఆమె స్నేహితుల కారులో ఎక్కించానని.. ఆ తర్వాత నుంచి అదృశ్యమైందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. యువతి అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఎస్సై భానుమతి తీసుకున్నారు. ఆమె ముందుగా ప్రాథమిక వివరాల కోసం చివరిసారిగా కలిసిన సాయికృష్ణను విచారించారు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని వందలాది సీసీ కెమెరాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.
Saroornagar Apsara Murder Case : ఈనెల 3వ తేదీ రాత్రి 11 గంటలకు రాళ్లగూడలోని ఓ ఫాస్ట్‌పుడ్ హోటల్ దగ్గర అప్సరతో కలిసి పూజారి సాయి సాయికృష్ణ భోజనం చేసిన దృశ్యాలను గుర్తించారు. సాయికృష్ణ ఫిర్యాదును మరోసారి పరిశీలించగా.. రాత్రి 10.20 గంటలకు కారులో వెళ్లినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అనుమానంతో సాయికృష్ణను పిలిచి ఆరా తీయగా తనకు సంబంధం లేదని రాత్రి 10.20కి కారులో వెళ్లిందని బుకాయించాడు. రాత్రి 11 గంటలకు ఇద్దరు కలిసి భోజనం చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పూజారికి చూపించారు. సాయికృష్ణ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అదేరోజు సంచరించిన ప్రాంతాల వివరాలు సేకరించి అతని ముందుంచారు.
Hyderabad Apsara Murder Case Updates : ఆధారాలు చూపిస్తూ పోలీసులు మరింత గట్టిగా ప్రశ్నించగా.. సాయికృష్ణ నిజాన్ని అంగీకరించాడు. అప్సరను నర్కుడలోని ఓ వెంచర్‌లో హత్య చేసి మృతదేహాన్నిసరూర్‌నగర్‌లోని మ్యాన్‌హోల్‌లో వేసినట్లు తెలిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఆర్జీఐఏ స్టేషన్‌లో నమోదైన యువతి అదృశ్యం కేసును.. హత్య కింద నమోదు చేసి ఈ నెల 9న పూజారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్సరను హత్య చేసిన ప్రాంతం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో కేసు అక్కడికే బదిలీ చేశారు. అప్సర హత్య కేసు వివరాలను లోతుగా విచారించడానికి సాయికృష్ణని వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసినట్లు శంషాబాద్ పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: