తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులూ బహుపరాక్.. కనకదుర్గమ్మ చీరల పేరుతో మోసం - విజయవాడ కనకదుర్గ ఆలయం తాజా వార్తలు

జగజ్జనని అయిన ఏపీ విజయవాడ కనకదుర్గమ్మ గుడిని మోసగాళ్లు వాడుకుంటున్నారు. ప్రజల భక్తిని, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. అమ్మవారికి భక్తులు మొక్కుబడిగా, కానుకగా సమర్పించిన ఖరీదైన చీరలు.. లక్కీడ్రాలో తక్కువ ధరకు ఇస్తున్నామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. వారికి ఫోన్లు చేసి వలలో వేసుకుని డబ్బు దండుకుంటున్నారు. సాక్షాత్తూ ఆలయ ఈవో కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, గుడి మాజీ ఉద్యోగులకే ఇలాంటి ఫోన్లు రావడం చర్చనీయాంశమైంది.

భక్తులూ బహుపరాక్.. కనకదుర్గమ్మ చీరల పేరుతో మోసం
భక్తులూ బహుపరాక్.. కనకదుర్గమ్మ చీరల పేరుతో మోసం

By

Published : Dec 3, 2020, 10:42 PM IST

భక్తుల కొంగు బంగారం ఏపీ విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ. అమ్మవారికి సమర్పించిన ప్రసాదమైనా, కానుకలైనా భక్తులు కళ్లకద్దుకుని తీసుకుంటారు. వాటిని పరమ పవిత్రంగా భావిస్తారు. అందులోనూ దుర్గమ్మకు సమర్పించిన చీరలను ఇష్టపడి ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ చీరలపైనా మోసగాళ్ల కన్నుపడింది.

వేలం కేంద్రంలో అమ్మకాలు

సాధారణంగా చీరలకు ఎంతో కొంత కనీస ధర నిర్ణయించి ఆలయ ప్రాంగణంలోనే భక్తులకు విక్రయిస్తారు. అమ్మవారికి ముడుపులు, కానుకలుగా భక్తులు సాధారణ రకం నుంచి ఖరీదైన పట్టుచీరల వరకు సమర్పిస్తుంటారు. పట్టుచీరలను అమ్మవారికి అలంకరిస్తారు. ఇతర చీరలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి వాటిని వేలం కేంద్రం వద్దకు తీసుకొస్తారు.

భక్తులు అందజేసిన చీర విలువను పుస్తకంలో నమోదు చేసుకుని, వివరాలను కంప్యూటర్​లో పొందుపరిచి ఆ చీరకు ఓ ట్యాగ్‌ వేస్తారు. ఆ విలువకు మించి తక్కువకుగానీ, ఎక్కువకుగానీ విక్రయించడానికి లేదు. ఇదీ ప్రస్తుతం ఆలయ విధానం.

తక్కువ ధరకే అమ్మకాలంటూ ఫోన్లు

గత కొద్ది రోజుల నుంచి ఏపీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలువురు భక్తులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వెళ్లాయి. అమ్మవారికి అలంకరించిన రూ. 5 వేల విలువైన చీరను.. రూ. 2 వేలకే విక్రయిస్తున్నట్లు వస్తున్న ఫోన్లు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అమ్మవారిపై విశ్వాసం, భక్తి భావాన్ని ఆసరాగా చేసుకుని వారిని వలలో వేసుకునేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారు.

గతంలో అమ్మవారి ఆలయంలో పనిచేసిన ఓ ఉద్యోగిని, విజయవాడకు చెందిన ఓ పోలీసు అధికారి, దుర్గగుడి ప్రస్తుత ఈవో కుటుంబ సభ్యులకు మోసగాళ్ల నుంచి ఫోన్లు రాగా వారు అప్రమత్తమయ్యారు. వారికి ఆలయ అధికారులు, యంత్రాంగంతో పరిచయం ఉన్నందున.. మోసగాళ్ల వలలో చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఇలా ఎంతమంది మోసపోయారో అనే ఆందోళన ఆలయ పాలక మండలి అధికారుల్లో వ్యక్తమవుతోంది. లక్కీ డ్రా పేరుతో మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్లకు భక్తులు స్పందించవద్దని ఈవో సూచించారు.

అంతా ఆన్​లైనే.. కానీ

ప్రతి శుక్ర, ఆదివారాలు అమ్మవారి చీరలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ రద్దీ ఉంటుంది. సాధారణ రోజుల్లో 150 నుంచి 200 వరకు చీరల విక్రయాలు ఉంటే.. ఈ 2 రోజుల్లో ఆ సంఖ్య 500 నుంచి 1000 ఉంటుంది. పండుగ రోజుల్లో మరింత రెట్టింపు సంఖ్యలో చీరల విక్రయాలు జరుగుతాయి. వివాహాలు, ఇతర శుభ కార్యక్రమాల సమయంలో అమ్మవారికి సమర్పించిన చీరల్లో ఖరీదైన వాటిని తీసుకుని తమ ఇంట్లో పూజల్లో భాగంగా వినియోగించడం పరిపాటి.

గతంలో చీరల విక్రయాలు, వేలం విషయాల్లో చాలా ఆరోపణలు రావడం.. సిండికేట్‌ అయి ఖరీదైన చీరలను తక్కువ మొత్తానికి పొందుతూ దారి మళ్లిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తినందున మొత్తం పద్ధతిలో మార్పులు తీసుకొచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మినహా మరెక్కడా చీరల విక్రయాలు లేకుండా నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం పద్ధతిని ఆన్‌లైన్‌ చేశారు. భక్తుల నుంచి చీర పొందినప్పటి నుంచి విక్రయించే వరకు అన్నింటికీ రికార్డులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో లక్కీ డ్రా పేరుతో మోసాలు బయటకు రావడం ఆలయ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ఇదీ చూడండి:ఏర్పాట్లు పూర్తి.. మొదటి ఫలితం వెలువడేది అక్కడే!

ABOUT THE AUTHOR

...view details