Saras Fair in hyderabad: హైదరాబాద్ నగరవాసులను.. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన.. సరస్ ఎగ్జిబిషన్ కనువిందు చేస్తోంది. భారతీయ సంప్రదాయ కళాకారుల్లో.. అత్యధిక భాగం గ్రామీణ మహిళలే. వనరులు, అవకాశాలు, సామాజిక పరిమితుల కొరత కారణంగా.. వారు తమ జీవన పరిస్థితులను పెంచుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రాణం పోసుకున్నవే.. స్వయం సహాయక బృందాలు. మహిళలకు మరింత మెరుగైన అవకాశాలను అందిస్తూ.. వారిని సొంత కాళ్లపై నిలబెట్టేందుకు ఉపయోగపడుతున్నాయి.
ఎక్కడో మారు మూల గ్రామాల్లో ఉంటూ, బతుకు తెరువు తెలియక ఇబ్బంది పడుతున్న వారి కోసమే.. ఈ సంఘాలు. అలాంటి ఉపయోగకరమైన సంఘాల వారందరినీ.. ఒకే చోట చేరుస్తూ.. ప్రజలకు హస్త కళల గొప్పతనాన్ని చాటి చెప్పే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సరస్ ఎగ్జిబిషన్‌కు.. నగరవాసుల నుంచి విశేష స్పందన వస్తోంది. తక్కువ ధరలకే.. అరుదైన, నాణ్యమైన, కనువిందు చేసేలాంటి వస్తువులు ఒకే చోట లభించడంతో వినియోగదారులు ఎగ్జిబిషన్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టాల్స్ నిర్వాహకులు వైవిధ్యంగా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.