Sant Sevalal Jayanthi at BJP state office : తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని తండాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయాలను నిర్మిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్శిటీ త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందునే వర్శిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు బండి సంజయ్, భాజపా శ్రేణులు హాజరై... ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు
Bandi Sanjay : ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. సేవాలాల్ మహారాజ్ అమ్మవారి భక్తుడని.. భవానీ అమ్మవారి ఆశీస్సులు పొందిన వ్యక్తి సేవాలాల్ మహారాజ్ అన్నారు. అడవులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు ఏ కష్టమొచ్చినా అధిగమించేలా చేసిన వ్యక్తి సేవాలాల్ అని గుర్తు చేసుకున్నారు. దారులు, రహదారులు లేకపోయినా ఆనాడు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎలాంటి లిపి లేకపోయినా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది గిరిజనులకు ఏకం చేసిన మహనీయుడని కొనియాడారు.
మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం
మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకమని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. ఎస్టీ రిజర్వేషన్లు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని.. బండి సంజయ్ పేర్కొన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలైతే రిజర్వేషన్లు రద్దు ఖాయమని ఆరోపించారు.