Sankranti Celebrations in Shilparamam 2024 :హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఏటా ఘనంగా జరుగుతుంటాయి. మూడ్రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. వివిధ కారణాల రీత్యా సొంతూరికి వెళ్లలేని వారు ఇక్కడికి వచ్చి, ఇంటికి వచ్చామనే అనుభూతి పొందుతున్నారు. అధికారులు గాంధీమేళా బజార్‌తో పాటు డూడూ బసవన్న విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, బుడ్డ జంగమల ఆటలు, మాటలతో కోటలు దాటే తుపాకీ పిట్టలదొరల వేషాలతో సంక్రాంతి విశిష్టతను తెలియజేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో నగరవాసులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో శిల్పారామం సందడిగా మారింది.
Sankranti Festival 2024 Celebrations In Shilparamam :సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లలేకపోవడంతో శిల్పారామం వచ్చామని సందర్శకులు చెబుతున్నారు. ఇక్కడి వాతావరణం చూస్తుంటే ఊరికి వెళ్లలేదని బాధ పోయిందని, తమ ఊరిలో ఉన్నట్లే ఉందని అంటున్నారు. హరిదాసులు, గంగిరెద్దులు, ఎండ్లబండ్లను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న కళలను చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.సంక్రాంతి పండుగ విశేషాలు పిల్లలకు చెప్పాలంటే ఇక్కడికి వస్తే సరిపోతుందంటున్నారు.
శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు - సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలిగిందన్న సందర్శకులు
'ఈ శిల్పారామంలోకి వస్తే మా ఊరిలో ఎంజాయ్ చేసినట్టుగా ఉంది. అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. అంతా పల్లెటూరి వాతావరణం లాగా ఉంది. ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కుటుంబంతో కలిసి ఈ శిల్పారామం సందర్శించటం చాలా ఆనందంగా ఉంది. గగ్గిరెద్దులు, హరిదాసులు కీర్తనలు కనివ్వండి అన్ని చాలా బాగా అనిపిస్తున్నాయి. ఊరికి వెళ్లలేనప్పుడు ఇలా ఇక్కడికి వస్తే ఊరు వాతావరణమే గుర్తుకొస్తుంది. అంత అందంగా దీనిని తీర్చిదిద్దారు. పిల్లలు కూడా ఈ శిల్పారామంలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఊరికి వెళ్లలేకపోయామన్న బాధని ఇది పొగొట్టింది.' - సందర్శకులు