తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కోడి మాంసానికి ధర ఎక్కువ.. ఎందుకో తెలుసా? - ఏపీలో కోడి పందాలు న్యూస్

పుస్తెలమ్మైనా పులస చేప తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఖర్చు ఎంత అయినా కోస ముక్కలు తినాలనేది నానుడిగా మారిపోయింది. ఇంతకీ కోస అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే గోదావరి జిల్లాలకు రావాల్సిందే.

cock fight, west godavari
కోస, కోళ్ల పందేలు, పశ్చిమ గోదావరి

By

Published : Jan 16, 2021, 3:17 PM IST

కోస మాంసం వెల కాసు బంగారం ధరతో సమానంగా పలికింది. సంక్రాంతి బరుల్లో ఎన్నో కోళ్లను నేలకూల్చాక ప్రత్యర్థి పుంజుతో తలపడి చనిపోయిన కోడి పుంజు మాంసమే కోస. పందేల కోసం పెంచే కోళ్లకు జీడిపప్పు, బాదంపప్పు వంటి బలవర్థకమైన ఆహారాన్ని అందించడంతో పాటు శ్రద్ధగా ఏడాది పాటు పెంచుతారు. అది కనీసం 4 నుంచి 6 కిలోల బరువుంటుంది. అది నేలకొరిగాక కోస ధర చాలాచోట్ల రూ.20 వేల నుంచి 30 వేలకు పలికింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా సాగిన కోడి పందేల్లో.. కోస కోసం చాలా మంది ఆరాటపడ్డారు. వేలాదిగా ఖర్చు చేసి మరీ.. కోసను సొంతం చేసుకుని ఆనందపడ్డారు.

జోరుగా పందేలు

సంక్రాంతి సందర్భంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. పందేలను తిలకించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురితో పాటు తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా భారీగా తరలివచ్చారు. ప్రధాన బరుల్లో కోడిపందేలు, గుండాట, పేకాటకు రూ.కోట్లలో చేతులు మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో చిన్నాపెద్ద కలిపి 500కు పైగా బరులను ఏర్పాటుచేశారు. కోనసీమలోని ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెం వద్ద ఏర్పాటుచేసిన బరిలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కోడిపందేలను నిర్వహించారు. అల్లవరం మండలం గోడి, అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో బరుల వద్ద ఘర్షణల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పందేలను తిలకించడానికి వచ్చిన వారితో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో లాడ్జిలు, హోటళ్లు నిండిపోయాయి. జిల్లావ్యాప్తంగా 450 నుంచి 500 బరులు ఏర్పాటు చేశారు. మొగల్తూరు, భీమవరం పరిధిలో నిర్వహించిన బరుల్లో ఒక్కో పందేనికి రూ.6లక్షల వరకు బెట్టింగ్‌ కట్టారు. తెలంగాణ సరిహద్దున ఏర్పాటుచేసిన బరుల్లో పందేలను వీక్షించడానికి టిక్కెట్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏమాత్రం సౌకర్యాలు లేకున్నా పందేలు తిలకించడానికి రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ప్రముఖ తమిళ, తెలుగు సినీ హీరో విశాల్‌ కోడిపందేలను తిలకించారు.

ఇదీ చదవండి:ఈ సమయం కోసమే ప్రపంచమంతా ఎదురుచూస్తోంది : గవర్నర్

ABOUT THE AUTHOR

...view details