KTR Thanked Sandoz Company For Global Capability Center: హైదరాబాద్‌కు మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం రానుంది. అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తెలిపింది. మొత్తం 1800 మంది ఉద్యోగులు ఈ కేంద్రంలో పని చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్న శాండోస్ కంపెనీకి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని.. ఈ రంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఫార్మా, గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపిబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్‌ని అందించనున్నట్లు తెలిపింది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800కు పెంచనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్ ప్రతినిధి బృందం ఈ మేరకు ప్రకటించింది.
ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచస్థాయి లేబొరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో ఉన్న లైఫ్ సైన్సెస్ అనుకూల అంశాలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ఇప్పటికే తమ గ్రూప్ సంస్థ నోవార్టీస్ హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తోందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే పరిశోధనలను ఇక్కడి నుంచి నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.