Registrations Decreases in Telangana: రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. ఆశించిన మేర రానట్లు తెలుస్తోంది. చదరపు అడుగు మార్కెట్ విలువతో పాటు వెంచర్ల నుంచి కొనుగోలు చేసే ఖాళీ స్థలాల విలువ పెంచగా స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లు.. అదే స్థాయిలో రేట్లు పెంచడంతో కొనుగోలు దారులు ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. రెరా అనుమతి లేకుండా తక్కువకు విక్రయాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో ఫ్రీలాన్స్, యూఎస్డీ సేల్స్ కొంతమేర తగ్గాయి.
దాదాపుగా 219 ప్రాజెక్టులు పెండింగ్: రెరా అనుమతి లేకుండా నిర్మాణాలు చేసే బిల్డర్లు, లేఅవుట్లు వేసే స్థిరాస్తి వ్యాపారులకి క్రెడెయ్, ట్రెడా, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ సంఘాలు సభ్యత్వం ఇవ్వట్లేదు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో విధిలేక రెరాలో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ఎక్కువ మంది చొరవ చూపుతున్నారు. అయితే రెరా అథారిటీ ఛైర్మన్ లేకపోవడంతో అనుమతుల మంజూరు నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 219 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్న స్థిరాస్తి వ్యాపారులు వాటి విలువ రూ.10 వేల కోట్లుగా అంటున్నారు.
క్రయ విక్రయాలు తగ్గడంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు: ఆ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌లో 90 శాతం ఉండగా.. మరో 10 శాతం జిల్లాల్లో ఉన్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. ధరలు పెరగడం, రెరా అనుమతి లేని ఆస్తుల కొనుగోలుకు ప్రజలు ముందుకు రాకపోగా అమ్మకాలు మందగించాయి. ఎక్కువ మంది కొత్తవాటి జోలికి వెళ్లకుండా తక్కువకు వచ్చే పాత ఇళ్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. వివిధ కారణాలతో క్రయ విక్రయాలు తగ్గడంతో ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.