ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండల సమీపంలో రైల్వే పట్టాలపై పల్లకొండ రాజు శవమై తేలాడు.హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ నెల 9న చిట్టితల్లిని హత్యాచారం చేసిన ఘటనలో నిందితుడైన రాజు కొన్ని రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం విదితమే. అతనిపై రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. గురువారం ఉదయం వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చిల్పూరు మండలం నష్కల్, ఘన్‌పూర్ స్టేషన్ మధ్య రాజారం వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతదేహానికి రాత్రి ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. రాజు శరీరంపై కొట్టినట్లు, చిత్రహింసలు పెట్టినట్లు గానీ, తూటా గాయాలు గానీ లేవని, రైలు ప్రమాదంలో పట్టాలు గీరుకుపోయిన ఆనవాళ్లు, నల్లటి గ్రీజు మాత్రమే ఉన్నట్లు ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజామాలిక్ తెలిపారు.
రాజుది ఆత్మహత్య అని నిర్ధారించామని, రైల్వే చట్టాల ప్రకారం కేసు నమోదు చేశామని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) ఎస్పీ అనురాధ చెప్పారు. నిందితుడిని పోలీసులు పట్టుకెళ్లి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోపక్క మృతిచెందిన చిన్నారి కుటుంబసభ్యులను హోం మంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌లతో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మణ్, నగర కోత్వాల్ అంజనీకుమార్ పరామర్శించారు. రూ.20 లక్షల చెక్కును, రెండు పడక గదుల ఇంటిని మంజూరు చేస్తూ సంబంధిత పత్రం అందజేశారు. ప్రభుత్వ శాఖలో పొరుగుసేవల కింద ఉద్యోగం ఇస్తున్నామని చెప్పగా.. తాను ఆటోడ్రైవర్ అని, కారు ఇప్పిస్తే బాగుంటుందని చిన్నారి తండ్రి చెప్పడంతో వారు సమ్మతించారు. మూడు రోజుల్లో కారు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
శరీరంపై గుర్తుల ఆధారంగా..
రైలు ఢీకొనడంతో రాజు శరీరం ఛిద్రమైంది. ముఖం నుజ్జునుజ్జయ్యింది. కీమెన్ సారంగం నష్కల్ స్టేషన్ మాస్టర్ హరిశంకర్, ఘన్‌పూర్ పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుని చేతిపై అతని భార్య మౌనిక పేరు పచ్చబొట్టుగా ఉండడంతో పాటు, శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా ఈ మృతదేహం రాజుదే అని ఎస్‌ఐలు రమేశ్‌నాయక్, శ్రీనివాస్ నిర్ధారించి ఉన్నతాధికారులకు తెలిపారు. ఘటనాస్థలంలో ఓ సెల్‌ఫోన్ ముక్కలై కనిపించగా, మరో పది రూపాయల నోటు పట్టాలపై పడి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించే లోపు సుమారు అయిదు రైళ్లు మృతదేహంపై నుంచి వెళ్లాయి. విషయం తెలిసిన వెంటనే ఘన్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి వరుసకట్టారు. అతను చేసిన పాపానికి ఇదే సరైన శిక్ష అంటూ తిట్టిపోశారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం తరలించారు. రాజు బావమరుదులు మార్చురీకి వచ్చి గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం వరంగల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
24 గంటల్లో ఏమీ తినలేదు..
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాజుది ఆత్మహత్యే అని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోస్టుమార్టం నివేదికలో ఏం తేలిందనే విషయంపై ఎంజీఎం మార్చురి ఫొరెన్సిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజామాలిక్‌తో ‘న్యూస్‌టుడే’ మాట్లాడింది. నిందితుడి కుటుంబసభ్యులు ఆరోపించినట్లుగా రాజు శరీరంపై ఎలాంటి గాయలు లేవన్నారు. నిందితుడు ఆత్మహత్య చేసుకోవడానికి 24 గంటల ముందు ఏమీ తినలేదని, పొట్టలో పింక్ ద్రవపదార్థాలు ఉండటంతో అనుమానంతో విత్‌డ్రా పరీక్ష కోసం 50 గ్రాముల ద్రవపదార్థాలను సేకరించి హైదరాబాద్ ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. చిన్నారి అత్యాచారం చేసింది మృతుడు రాజునేనా అని నిర్ధారణ చేసుకోవడానికి మృతుడికి డీఎన్‌ఏ పరీక్ష చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం మొత్తం వీడియో చిత్రికరణలో పూర్తిచేసినట్లు వివరించారు.
ఆ మృగం చనిపోయింది : కేటీఆర్
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు.జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ఆత్మహత్య సంఘటన గురించి పోలీసులు, కీమెన్ సారంగం, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నష్కల్ ఘన్‌పూర్ మధ్య విధులు నిర్వహిస్తున్న కీమెన్ సారంగం ఉదయం 8.40 గంటలకు ఒక వ్యక్తి పట్టాలపై ఉండడం చూసి... కాగితాలేరుకునే వ్యక్తి అని భావించాడు. జులపాలతో, ముఖానికి మాస్కు పెట్టుకొని కనిపించిన అతన్ని నీ పేరేంటని అడగ్గా, నీకెందుకురా అంటూ దురుసుగా సమాధానమిచ్చాడు. అప్పటికే గూడ్సు రైలు వస్తుండగా, పక్కకు తప్పుకోరా అంటూ రాళ్లతో సారంగం అతన్ని అదిలించగా, పక్కనున్న చెట్ల గుబుర్లోకి వెళ్లి దాక్కున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చూసిన రాజు ఇతనే అనే అనుమానంతో సారంగం పట్టుకోవాలనుకున్నాడు. పక్కన పొలంలో ఉన్న రైతు సోదరులు భుక్యా గేమ్‌సింగ్, రామ్‌సింగ్‌లను పిలిచాడు. వారు వచ్చే లోపే మళ్లీ ట్రాక్‌పైకి వచ్చిన రాజు కాజీపేట నుంచి జనగామ వైపు సుమారు 90-100 కి.మీ. వేగంతో వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
కంట్రోల్ రూంకు డ్రైవర్ సమాచారం..