- గంజాయి కావాలి.. తెచ్చిస్తావా..?
- సర్.. ఫలానా దగ్గర రాజు కనిపించాడు. అరెస్ట్ చేస్తారా..? రూ.10 లక్షల రివార్డు నాకే ఇస్తారా..?
- సర్.. ఇప్పుడే చూశా.. పట్టుకునేలోపే మాయమయ్యాడు. ఆ డబ్బు ఇచ్చేస్తారా..?
సైదాబాద్ హత్యాచార (Saidabad Incident)నిందితుడి ఆచూకీ చెబుతారని పోలీసులు నంబర్లు ప్రకటిస్తే.. వాటికి వచ్చిన ఫోన్‌కాల్స్ ఇలా ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 వేల కాల్స్ వచ్చాయి. వీటిలో దాదాపు అన్నీ ఉత్తుత్తివే కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. రాజు గురించి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. కొందరు ఈ ఫోన్ నంబర్లు నిందితుడివే అనుకొని తిట్లదండకం అందుకున్నారు. మరికొందరేమో గంజాయి ఉందా అని అడిగారు. మొదట్లో ప్రతి కాల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తర్వాత నమ్మదగిన సమాచారం అనిపిస్తేనే రంగంలోకి దిగారు.
సీసీ కెమెరాల పరిశీలన క్రమమిది..
రాజును పట్టుకొనేందుకు సుమారు 3 వేల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, 2 వేల మందిని విచారించారు. సంతోష్‌నగర్ లేబర్ అడ్డాకు వెళ్తాడన్న సమాచారంతో ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మిధాని, మలక్‌పేట్ మార్గాల్లో ప్రధాన రహదారులు, ప్రైవేటు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.
- సంతోష్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్‌లలోని వెయ్యికి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రాజు, అతడితోపాటు మరో వ్యక్తి కనిపించాడు.
- ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, ఉప్పల్ వైపు ఉన్న 800 సీసీ కెమెరాల ఫుటేజీలను చూశారు. నాగోల్, ఉప్పల్ రహదారిపై తొమ్మిది కెమెరాల్లో కనిపించడంతో పరిశోధన ఉప్పల్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
- బోడుప్పల్ వరకూ మరో 1200 కెమెరాలను పరిశీలించారు. ఒకట్రెండు చోట్ల నిందితుడి అస్పష్ట దృశ్యాలుండడంతో ఘట్‌కేసర్ వైపు దృష్టిసారించారు.