కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన.. ఇద్దరు రచయితలకు పురస్కారాలు..! Sahitya Academy Awards: ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. మరో రచయిత, కవి "వారాల ఆనంద్"కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు లభించింది. దక్షిణ భారతదేశంలో వందేళ్లకు పూర్వం ఉన్న దేవదాసీ వ్యవస్థ, క్రమంగా పెరిగిన తీరు, క్షీణత, దేవదాసీలుగా ఉంటూ ప్రముఖులైన మహిళల జీవితాలపై విశ్లేషణాత్మకంగా మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనోధర్మపరాగం’నవల 2022 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది.
బ్రిటిష్ పాలకులొచ్చాక దేవదాసీల ఈనాం భూములను రద్దు చేయడంతో వారి జీవితాల్లో వచ్చిన మార్పులు, దేవదాసీల మనోగతాన్ని చిత్తూరు యాసలో రచయిత వివరించారు. ఈ నవలకు గతంలో ‘ఆటా’ బహుమతి కూడా దక్కింది. ప్రముఖ కవి గుల్జార్ హిందీలో రచించిన ‘గ్రీన్ పోయెమ్స్ను ఆకుపచ్చ కవితలు’గా వారాల ఆనంద్ అనువదించారు. దీనికి అనువాద పురస్కారం దక్కింది.
ప్రకృతిని కళ్లకు కట్టినట్లు సజీవ సాక్ష్యాలతో వర్ణించిన గుల్జార్ హిందీ కవితలను తెలుగులోనే రాశారా అన్నట్లుగా వారాల ఆనంద్ అనువదించారు. మొత్తం 23 భాషల సాహితీకారులను పురస్కారాలకు ఎంపిక చేసినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం విజేత వారాల ఆనంద్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ప్రముఖ భావకవి గుల్జార్ గారి 58 కవితలను ఆకుపచ్చ కవితలు పేరిట తెలుగులో అనువదించిన వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కడం పట్ల కేటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. గుల్జార్ లాంటి గొప్ప కవి సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు వారాల ఆనంద్ అనువాదం ద్వారా అందిచడం గొప్ప విషయమని కేటిఆర్ అన్నారు. ఆనంద్ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, స్థానిక ప్రజాప్రతినిదిగా తనకు మరింత సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు.
ఇవీ చదవండి :