Saffron cultivation in Hyderabad: అందాల కశ్మీర్ లోయకే పరిమితమైన సుగంధ ద్రవ్యాల్లో రారాణిగా భావించే కుంకుమపువ్వు.. ఇప్పుడు భాగ్యనగరంలోనూ విరబూస్తోంది. సహజమైన చల్లని ప్రదేశాల్లోనే కాక నియంత్రిత వాతావరణంలోనూ పండించగలమని నిరూపించింది.. హైదరాబాద్‌కు చెందిన అర్బన్ కిసాన్ అంకుర సంస్థ. రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హ శాంతివనంలో వీటిని హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఈ మొక్కలను పెంచుతున్నారు. కన్హశాంతి వనం మార్గదర్శకులు గురూజీ కమలేష్ పటేల్‌జీ సూచలనతో అర్బన్ కిసాన్ సంస్థ కుంకుమ పువ్వు సాగు ప్రారంభించింది. ఏప్రిల్ నుంచి ఈ ప్రయత్నాలు మొదలుపెట్టగా... ఆగస్టులో మొక్కల పెంపకం ప్రారంభించారు. ఈ మేరకు కశ్మీర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ శాఫ్రాన్ రీసెర్చ్‌ను సందర్శించిన అర్బన్ కిసాన్ అంకుర సంస్థ నిర్వహకులు.. అక్కడి శాస్త్రవేత్తలు, డైరెక్టర్లతో సమావేశమై పూర్తి వివరాలు సేకరించారు. మొక్కలు పెరగడానికి అనువైన వాతావరణం, తేమ, కార్బన్ డయాక్సైడ్, పోషకాలు ఎలా ఉండాలనే వివరాలు సేకరించారు.
హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచిన కుంకుమపువ్వు మొక్కలు
క్వింటాలు విత్తనాలు రూ. 18 వేలు ఉండగా 1.5 క్వింటాళ్ల విత్తనాలను కొనుగోలు చేశారు. వర్టికల్ విధానంలో హైడ్రోపోనిక్స్(saffron cultivation in hydroponics process) పద్ధతిలో మొక్కలు పెంచుతున్నారు. అనువైన, నియంత్రిత వాతావరణం ఏర్పాటు చేసి ఆగస్టులో విత్తనాలు వేయగా ప్రస్తుతం 14 వేల మొక్కలు పెరిగాయని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో మొక్కకు 3 నుంచి 4 పువ్వులు పూయగా.. ఒక్కో పువ్వు నుంచి మూడు తీగలు వస్తాయి. ప్రస్తుతం రెండువేల పూలు పూశాయని.. మరో 15 రోజుల్లో మొత్తం కోతకు వస్తాయని పేర్కొన్నారు. తొలిదశ ప్రయోగం విజయవంతం అవడంతో రెండో దశలో విస్తృత పెంపకం కోసం విత్తనాలను ఇక్కడే ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్స్టిట్యూట్లోని టిష్యూ కల్చర్ ద్వారా విత్తనాలను సేకరించనున్నారు. టిష్యూ కల్చర్ ల్యాబ్‌ను ఇందుకు వినియోగిస్తున్నారు. వచ్చే సంవత్సరం టన్ను విత్తనాల ద్వారా పెంపకం చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎగుమతులూ చేయొచ్చు