Saddula Bathukamma Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరువాడా.. రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చి.. రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు. అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు.
ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మలతో భారీ ప్రదర్శన:ఎల్బీ స్టేడియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్యర్యంలో నాలుగు వేల బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని భారీ ప్రదర్శనగా ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. ఈ ర్యాలీలో కళాకారుల ప్రదర్శలు ఆకట్టుకున్నాయి.
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మలతో హుస్సేన్‌సాగర్ కాంతులీనింది. అనంతరం బాణసంచా ప్రదర్శన కట్టిపడేసింది. హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలతో కలిసి కవిత ఆడిపాడారు.
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు:సూర్యాపేటలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా సాగాయి. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి..రాగ యుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. ఖమ్మంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చారు. వాటి చూట్టూ ఆడిపాడారు.