తెలంగాణ

telangana

ETV Bharat / state

చూపరులను అలరించిన దున్నపోతుల విన్యాసాలు

యాదవులు ప్రత్యేకంగా నిర్వహించే సదర్‌ ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. మేలిరకం దున్నపోతులను అలంకరించి వేడుకలు నిర్వహించారు. దున్నపోతులతో చేసిన విన్యాసాలు అహూతులను అలరించాయి. నేడు హైదరాబాద్ నారాయణగూడలో జరగనున్న సదర్ ఉత్సవాల దృష్ట్యా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

sadar festival in telangana 2020
చూపరులను అలరించిన దున్నపోతుల విన్యాసాలు

By

Published : Nov 16, 2020, 5:30 AM IST

చూపరులను అలరించిన దున్నపోతుల విన్యాసాలు

యాదవ సామాజికవర్గం ప్రత్యేకంగా జరుపుకునే పండుగ... సదర్‌ ఉత్సవం. దీపావళి ఉత్సవాల్లో భాగంగా పర్వదినం జరిగిన తర్వాత అట్టహాసంగా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలంకరించిన దున్నపోతులతో విన్యాసాలు నిర్వహించడం ఉత్సవం ప్రత్యేకత. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో సదర్ వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఖైరతాబాద్ గ్రంథాలయ చౌరస్తా నుంచి... రైల్వేగేటు వరకు ఉత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు నగరం నలుమూలల నుంచి 50 దున్నపోతులు తరలివచ్చాయి. వాటితో విన్యాసాలు చేయించారు. సదర్‌ మేళాను చూసేందుకు నగరవాసులు భారీగా తరలి వచ్చారు. వేడుకల్లో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఖైరతాబాద్ సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

25 సార్లు ఛాంపియన్‌

అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ ప్రత్యేకంగా దున్నపోతును తెప్పించారు. హర్యానాలో 25 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సర్తాజ్ దున్నపోతును హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇది టన్నున్నర బరువు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సర్తాజ్​ను ప్రతిరోజు ఇద్దరు వ్యక్తులు పర్యవేక్షిస్తారని... 20 లీటర్ల పాలు, ఎండు ఫలాలు, ఆపిల్స్‌ సహా పౌష్టికాహారం అందిస్తారని తెలిపారు. నల్గొండలోని యాదవభవన్ వద్ద సదర్‌ వేడుకలు జరిగాయి. వేడుకలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్‌ శివారు అనాజ్‌పూర్‌లో సదర్‌ మేళా అట్టహాసంగా జరిగింది. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి విన్యాసాలు చేయించారు.

ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నారాయణగూడలో నేడు సదర్ ఉత్సవాల సందర్భంగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారు జామున మూడు గంటల వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు. కాచిగూడ నుంచి నారాయణగూడ వచ్చే వాహనాలు... కాచిగూడ టూరిస్ట్ హోటల్‌ మీదుగా మళ్లించనున్నారు. విట్టల్‌ వాడి నుంచి వచ్చే వాహనాలు రామకోటి క్రాస్ రోడ్, ఓల్డ్ బర్కత్‌పుర్ నుంచి వచ్చే వాహనాలు క్రౌన్ కేఫ్ మీదుగా మళ్లిస్తారు. బర్కత్‌పుర చమాన్ నుంచి వచ్చే వాహనాలు టూరిస్ట్ హోటల్ మీదుగా భర్కత్‌పుర క్రాస్‌రోడ్ వైపు, నారాయణగూడ లిటిల్ ఫ్లవర్ స్కూల్ నుంచి రెడ్డి కళాశాల మీదుగా వచ్చే వాహనాలు... నారాయణ గూడ క్రాస్ రోడ్‌ వైపు మళ్లించనున్నట్లు వెల్లడించారు.


ఇదీ చూడండి :దీపావళికి రోజున మూగజీవాలకు పెళ్లి

ABOUT THE AUTHOR

...view details