Sabita Indra Reddy On Higher Education: రాష్ట్రం ఏర్పాటుతో ఉన్నత విద్యలోనూ కీలక మార్పులు వచ్చాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యాలయాల్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చే పరిస్థితి వచ్చిందని తెలిపారు. మూస పద్ధతిలో కాకుండా డిమాండ్‌కి తగ్గట్టు చదవాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన ఉన్నత విద్య సదస్సులో ఆమె పాల్గొన్నారు.
ఉన్నత విద్యతో ఉద్యోగావకాశాలపై అనే అంశంపై ఈ సదస్సులో చర్చించారు. ఐటీ పాలసీలు మార్చుతూ కేటీఆర్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ కృషితో 1500 కంపెనీలు నగరానికి వచ్చాయని అన్నారు. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆశయం మేరకు చదివిన ప్రతీఒక్కరికి ఉద్యోగం కల్పించే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.