Rythu Runamafi Telangana 2023 : రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రూ.99,999లోపు ఉన్న రుణాల మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రుణమాఫీ నిధుల విషయమై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రైతుల రుణ ఖాతాల్లో జమకు నిధులు విడుదల చేశారు. సోమవారం రూ.5,809.78 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేశారు. తాజా నిర్ణయంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 16,66,899 మంది రైతులకు రుణాలు మాఫీ కానున్నాయి.
2014లో తొలి విడతగా రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. రెండో విడతగా రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ(Rythu Runa Mafi Telangana) చేస్తామని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఏడాది డిసెంబరు 11 నాటికి ఉన్న రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. అందుకు ఆర్థిక శాఖ, వ్యవసాయ అధికారులు బ్యాంకుల ద్వారా వివరాలు సేకరించినా.. ఆ తర్వాత పెద్దనోట్ల రద్దు, కరోనా, ఇతర ఇబ్బందులతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకులోనై నిధుల కొరత ఏర్పడింది.
'మేం అధికారంలోకి వస్తే.. రైతులకు 30 రోజుల్లోనే రూ.2లక్షలు రుణమాఫీ'
Farmer loan waiver in Telangana : 2021లో ప్రభుత్వం రూ.37 వేల వరకు రుణాలున్న 7,19,488 మంది రైతులకు రూ.1,943 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. మరోసారి రుణమాఫీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన నిర్ణయించింది. దీనికి సెప్టెంబరు 15 వరకు గడువు విధించింది. ఇందుకు అనుగుణంగా రూ.18 వేల కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాని ప్రకారం ఈ నెల మూడో తేదీన రూ.41 వేలలోపు రుణాలున్న 62,758 మంది రైతులకు రూ.237.85 కోట్లు విడుదలయ్యాయి. 4వ తేదీన రూ.43 వేలలోపు రుణాలున్న 31,339 మంది రైతులకు సంబంధించి రూ.126.50 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.