Revanth Reddy on Rythu Bandhu Funds Release Permission Revoke :రైతుబంధును నిలిపివేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఆలోచన, ఉద్దేశం మామా-అల్లుళ్లకు (సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు) లేదని ఆయన ధ్వజమెత్తారు. హరీశ్‌రావు నియమావళిని ఉల్లంఘిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉప సంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలిపారు.
Rythu Bandhu Funds Release Issue in Telanganaఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు నియమావళిని ఉల్లంఘించడంతో ఈసీ తీవ్రంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప.. రైతులకు న్యాయం జరగదన్న ఆయన.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. తాము అధికారంలోకి రాగానే పది రోజుల్లో రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేల లెక్కన అన్నదాతల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.
"రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా-అల్లుళ్లకు లేదు. హరీశ్‌రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉప సంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప.. రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే.. రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం." - రేవంత్ రెడ్డి ట్వీట్