రాయలసీమలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటిగా పేరుగాంచిన తిరుపతి రుయా కొవిడ్ వైద్యశాలలో... సోమవారం ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు వదిలిన ఘటనపై అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఆసుపత్రిలోని వెయ్యి పడకల్లో 700 ఆక్సిజన్ ఆధారమితమైనవి. వీటికి రోజుకు 15 వేల లీటర్ల ద్రవరూప ఆక్సిజన్ నిల్వలు అవసరమవుతాయి. ఈ లెక్కలు తెలిసిన అధికారులు... సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులో పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీపెరంబుదూరు నుంచి ఉదయం బయల్దేరాల్సిన ట్యాంకర్ రాత్రి వరకూ రాకపోయినా... ఈ విషయాన్ని సమయానికి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
సకాలంలో స్పందించి ఉంటే..
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ నిల్వలు తగ్గుతున్న సమయంలో... ఆక్సిజన్ ఆపరేటర్స్ వెంటనే అప్రమత్తమయ్యారు. డైరెక్టర్ నుంచి కలెక్టర్ వరకూ అందరికీ సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... సమయానికి ఆక్సిజన్ ట్యాంకర్ ఆసుపత్రికి చేరుకునేలా ఏర్పాటు చేశారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ ఆపరేటర్లు ఈ విధంగా స్పందించి ఉంటే... సోమవారం 11 మంది మృతిచెందేవారు కాదనే వాదన వినిపిస్తోంది.