తిరుమలలో గడిచిన వారం రోజుల నుంచీ భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. దీంతో.. స్వామి దర్శనానికి ఏకంగా 40 గంటలకు పైగా సమయం పడుతోంది. ఫలితంగా.. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగానే.. బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది తితిదే. ఇలాంటి పరిస్థితుల్లో.. రాష్ట్ర మంత్రి ఉష శ్రీ చరణ్ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లడం గమనార్హం. ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనానికి వెళ్లారు మంత్రి.
అక్కడి అధికారులు పరిస్థితి వివరించినా.. వారిపై ఒత్తిడి చేసి అనుచరులకు బ్రేక్ దర్శనాలు ఇప్పించారు మంత్రి. మరో పది మంది అనుచరుల వరకు సుప్రభాత సేవా టికెట్లు సైతం ఇప్పించారు. మంత్రి వ్యవహార శైలిపై సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం తాము రోజుల తరబడి నిల్చుంటే.. మంత్రి మధ్యలో వచ్చి, వెంట జనాన్ని తీసుకొచ్చి, బ్రేక్ దర్శనాల పేరుతో దర్శనం చేసుకొని వెళ్లిపోతారా? అని మండి పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను తోసుకుని మంత్రి ఉష శ్రీచరణ్ వెళ్లిపోవడం గమనార్హం.
వాస్తవానికి తిరుమలలో గడిచిన వారం రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన తితిదే.. భక్తులకు సూచనలు చేసింది. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని చెప్పింది. పైగా తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తున్నందున భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపింది. అధిక రద్దీ దృష్ట్యా.. వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.