Kartika Purnima in Telangana 2022: కార్తిక సోమవారం ప్రత్యేక పూజలతో రాష్ట్రంలోని శైవఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఉదయం నుంచి భారీగా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో సోమవారాల్లో హరిహర క్షేత్రంలోని భవాని శివాలయంలో భక్తులు తమ గోత్ర నామాలతో పూజలు జరిపించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితి పాటిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం ఆలయంలో సహస్ర దీపాలంకరణ నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.
ఖమ్మం జిల్లా తల్లాడలో కార్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవంలో మహిళలతో పాటు సతీసమేతంగా వేలాది మంది తరలివచ్చి దీపాలు వెలిగించారు. పూజల్లో భాగంగా జ్యోతిర్లింగార్చన, రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన దీక్షితుల సుబ్రహ్మణ్యం సంగీత విభావరి ఆకట్టుకుంది. దీపార్చన అనంతరం మహిళలు కోలాటాలు, నృత్యాలతో అలరించారు.