Fish Markets Rush in Telangana : రాష్ట్రవ్యాప్తంగా చేపల మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మృగశిర కార్తె సందర్భంగా తప్పనిసరిగా చేపలు తినే ఆనవాయితీ ఏళ్ల నుంచి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపల మార్కెట్లలో రద్దీ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ముషీరాబాద్‌లోని దయారా చేపల మార్కెట్ రెండు రోజులుగా చిన్నాచితక వ్యాపారులు, టోకు వ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులు, ప్రజలతో కళకళలాడుతోంది. మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కృష్ణ, గుంటూరు, విశాఖపట్నంతో పాటు బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వేల టన్నుల చేపలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ముఖ్యంగా ముషీరాబాద్ దయారా మార్కెట్‌కు వందల లారీల్లో చేపలు వచ్చాయి.
Rush at Fish markets in Telangana :ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు రవ్వ, బొచ్చ, కొర్రమీను, టంటం, పాంప్లెట్, బంగారు తీగతో పాటు అనేక రకాల చేపలు, రొయ్యలు, పీతలు దిగుమతి అయ్యాయి. చేపల ధరలు కూడా గత ఎడాదికన్నా మరింత పెరిగాయి. సాధారణంగా రవ్వు, బొచ్చ రూ.70 నుంచి 90కు కేజీ అమ్ముతుండగా.. మృగశిర కార్తెసందర్భంగా రూ.120 నుంచి 200 వరకు అమ్ముతున్నారు. వ్యాపారులు కొర్రమీను హైబ్రిడ్ కేజీ రూ.300 నుంచి 400కు కేజీ అమ్మగా.. అసలైన కొరమీను రూ.500 నుంచి 800 వరకు అమ్ముతున్నారు. ముషీరాబాద్ చేపల మార్కెట్ నుంచి నగరంలోని పలు ప్రాంతాల చిన్నాచితక వ్యాపారులు పెద్ద ఎత్తున అన్ని రకాల చేపలు కొనుగోలు చేస్తున్నారు. తినే వారి సంఖ్య పెరగడంతో వ్యాపారులు కూడా దీనిని ఆసరాగా తీసుకుని ఎక్కువ ధరలకు చేపలను విక్రయిస్తున్నారు.
మృగశిర కార్తె ప్రభావంతో చేపల ధరలు అధికం :నిర్మల్ జిల్లా కేంద్రంలోని చేపల మార్కెట్లో చేపల కోసం జనాలు ఎగబడ్డారు. అధిక సంఖ్యలో ప్రజలు చేపలు కొనుగోలు చేయడంతో అక్కడ సందడిగా మారింది. వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలను విక్రయించడానికి తీసుకురాగా, వాటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు, చుట్టూ ఉన్న గ్రామస్థులు తరలివచ్చారు. మృగశిర కార్తె ప్రభావంతో చేపల ధరలు కూడా పెంచి విక్రయించారు. చేపల కేసం వచ్చిన ప్రజలు ధరలను ఏ మాత్రం లెక్కచేయకుండా కొనుగోలు చేశారు.