YCP Leaders Attack On Ramachandra Yadav House : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో చేపట్టిన రైతుభేరి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీలకతీతంగా పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ చేపట్టిన రైతుభేరికి అనుమతులు లేవంటూ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పుంగనూరులోని ఆయన ఇంటి నుంచి బయలుదేరిన వాహన శ్రేణిని పోలీసులు అడ్డుకుని ఆయన అనుచరులను 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సదుంలో రైతుభేరికి వెళ్లనీయకుండా రామచంద్ర యాదవ్‌ను నిలువరించిన పోలీసులు ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆయనను విడిచిపెట్టారు. దాంతో ఆయన తన అనుచరులు, మద్దతుదారులతో ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఇంటికి తిరిగివచ్చారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. తాను చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని పోలీసుల చేత అడ్డుకుంటున్నారన్నారు. రైతు సమస్యల పై పోరాడుతుంటే అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
"పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. సభను అడ్డుకోడానికి పోలీసులు యాక్ట్‌లు తీసుకోచ్చారు. సభను పూంగనూరు నియోజకవర్గంలో కాకుండా బయట నియోజకవర్గంలో పెట్టుకోవాలన్నట్లు పోలీసులు మాట్లడుతున్నారు. నేను కేవలం రైతుల సమస్యలపై సభను నిర్వహించలనుకున్నాను. కానీ, అధికార పార్టీ నాయకులు పోలీసులు, అధికారులను అడ్డు పెట్టుకుని సభను అడ్డుకొవాలని చూస్తున్నాను."- రామచంద్ర యాదవ్, పారిశ్రామికవేత్త