Govt doctors: ఇక నుంచి నియమితులయ్యే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేదు. కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో ఈ మేరకు నిబంధన అమలుచేయనున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వైద్యులకు ఈ నిబంధన వర్తించదు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రతిపాదిత దస్త్రంపై తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. ఈ అంశం సహా నియామకాల్లో పాటించాల్సిన మార్గదర్శకాలపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కొత్తగా నియమితులయ్యే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసును కోల్పోనుండడంతో.. వారికిచ్చే వేతనాలను భారీగా పెంచాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. నిమ్స్ తరహాలో వేతనాలు, అదే తరహాలో పనివేళలనూ అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా నిమ్స్ మాదిరిగా కొత్తగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులూ బలోపేతమవుతాయని ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. వేతన పెంపుపై త్వరలో విడుదలయ్యే మార్గదర్శకాల్లోనే పొందుపరుస్తారా? నియామక ఉత్తర్వుల సమయంలో వెల్లడిస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టంరాలేదని సమాచారం.
సేవా నిబంధనల్లోనూ మార్పులు:రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తారు. వాటిలో 10 వేలకుపైగా వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎం పోస్టులను వైద్య నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ నియామకాలు మాత్రం టీఎస్‌పీఎస్సీ సహకారంతో చేపడతారు. ఈ మొత్తం పోస్టుల్లో సుమారు 3 వేలు వైద్యుల పోస్టులు మినహా మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకూ రాత పరీక్ష ఉంటుంది. వైద్యులకు మాత్రం వారి అర్హత ప్రాతిపదికన అనుభవం వెయిటేజీని పరిగణనలోకి తీసుకొని నియమిస్తారు. నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు తదితర పోస్టులకు సంబంధిత అంశాల్లో పరీక్షను నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ కూర్పు కీలకంగా మారింది. చాలా ఏళ్ల తర్వాత నియామకాలు చేపడుతుండడంతో.. సిలబస్‌ను ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా రూపొందించడం ఆరోగ్య శాఖకు సవాల్‌గా మారింది. దాదాపు 20 ఏళ్ల కిందటి పోస్టులకు, ఇప్పటి కొత్త పోస్టులకు సంబంధం లేకుండా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు కార్డియాలజీ టెక్నీషియన్, డార్క్‌రూమ్ అసిస్టెంట్, స్టెరిలైజేషన్ టెక్నీషియన్ తదితర పోస్టులన్నీ గత 20 ఏళ్లలో కొత్తగా అందుబాటులోకి వచ్చినవే. అటువంటి వాటికి కొత్త సేవా నిబంధనలు రూపొందించడమూ ముఖ్యమే. వీటి రూపకల్పనలో వైద్యశాఖ ఆచితూచి అడుగులేస్తోంది. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు కూడా ఈ దఫా వెయిటేజీ ఇవ్వనున్నారు. వెయిటేజీ నిబంధనలను రూపొందించడంపైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పక్కాగా సిలబస్ రూపొందించాలని భావిస్తున్నారు. ఈ విషయంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో నియామక ప్రకటన వెలువడడానికి కొంత సమయంపడుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. కమిటీ నేతృత్వంలో సిలబస్ కూర్పు ఓ కొలిక్కి వచ్చిందనీ, ప్రభుత్వ అనుమతి కోసం పంపించామనీ.. రాగానే వారం, పది రోజుల్లో నియామక ప్రకటన వెలువరిస్తామని పేర్కొన్నాయి.