Srisailam project Rule curve: శ్రీశైలం పాజెక్టులోకి 1984 నుంచి 2021 వరకు 37 సంవత్సరాలపాటు వచ్చిన ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొని నీటిమట్టం నిర్వహణ, విడుదలకు సంబంధించిన రూల్‌కర్వ్‌ను ఖరారు చేసినట్లు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. సాగునీటి అవసరాల కోసం కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలా చూడటం.. దిగువన సాగు, తాగు నీటి అవసరాలను బట్టి విద్యుదుత్పత్తి చేయడం తదితర అంశాలను ఖరారు చేసినట్లు తెలిపింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఏర్పాటు చేసిన రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఆర్‌ఎంసీ) మే 30న సమావేశమై చర్చించిన అంశాలు, రిజర్వాయర్ల నిర్వహణపై రెండు రాష్ట్రాలకు కేంద్ర జలసంఘం తన అభిప్రాయాలను పంపింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు హాజరు కాగా.. తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు గైర్హాజరయ్యారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లకు సంబంధించిన రూల్‌కర్వ్‌లోని ముఖ్యమైన అంశాలను సీడబ్ల్యూసీ డైరెక్టర్ రుషిశ్రీవాత్సవ వెల్లడించారు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం, చెన్నై తాగునీటి సరఫరాకు సంబంధించి రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకొని రూల్‌కర్వ్ తయారు చేసినట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, సాగునీటి కోసం కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని పేర్కొంది. శ్రీశైలం, దిగువన ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు, నీటి సంవత్సరం ముగిసేనాటికి క్యారీ ఓవర్ స్టోరేజ్ కింద 45 టీఎంసీలు నిల్వ ఉండాలని కూడా నిబంధన విధించింది. దీనికి తగ్గట్టుగానే జూన్ ఒకటి నుంచి క్రమంగా రిజర్వాయర్‌లో నీటి నిల్వను పెంచుతూ సెప్టెంబరు 30 నాటికి పూర్తిస్థాయి నీటిమట్టానికి తేవాలని ప్రతిపాదించారు. రూల్‌కర్వ్‌పై తన అభిప్రాయాలను తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ మే 5న రాసిన లేఖకు కూడా కేంద్ర జలసంఘం డైరెక్టర్ సమాధానమిచ్చారు. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు వినియోగించుకుంటారు కాబట్టి దీని ప్రభావం రూల్‌కర్వ్‌పై ఏమీ ఉండదు.
అయితే.. ఈ 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను మహారాష్ట్ర, కర్ణాటకలు వాడుకొంటే, మిగిలిన 45 టీఎంసీలు శ్రీశైలంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 45 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటోంది. ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకోవాలని ఉందని, నాగార్జునసాగర్ పైన కృష్ణా బేసిన్‌లో ఉన్నది తమ ఆయకట్టే కాబట్టి మొత్తం తమకే చెందుతాయని తెలంగాణ చాలాకాలంగా పేర్కొంటోంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. శ్రీశైలంలో మొత్తం నీటి సంవత్సరంలో సాగునీటి కోసం కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని సీడబ్ల్యూసీ పేర్కొంది. పవర్‌హౌస్‌లకు సంబంధించి కనీస నీటిమట్టంపై భిన్నాభిప్రాయాలున్నాయని స్పష్టంచేసింది. రెండు రాష్ట్రాలు ఓ అభిప్రాయానికొస్తే దానికి తగ్గట్టుగా రూల్‌కర్వ్‌లో మార్పులు చేసుకోవచ్చని తెలిపింది.