విధుల్లో చేరతామంటూ కార్మికులు... అనుమతి లేదంటూ అధికారులు... పోలీసుల అరెస్టులతో ఆర్టీసీ డిపోలు అట్టుడుకుపోయాయి. తెల్లవారుజాము నుంచే డిపోల వద్దకు కార్మికులు చేరుకుంటుండగా... అడుగడుగునా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. తమ పరిస్థితి ఏమిటంటూ... కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. తాత్కాలిక కార్మికులను ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాతే డిపోల్లోకి అనుమతించారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ బస్సులు యథావిధిగా రోడ్లెక్కాయి. ప్రతి ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డిపో పరిసరప్రాంతాల్లో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇబ్బందిపడ్డారు.
కన్నీళ్లు పెట్టుకున్నా... కనికరించలేదు
తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు వేడుకున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకుండా ఉంటున్నామని... తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రాధేయపడుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లల చదువులకీ.. తల్లిదండ్రుల ఆసుపత్రుల ఖర్చులకి, ఇంటి కిరాయిలకు, కనీసం తినేందుకు బియ్యం కొనుగోలు చేసేందుకు కూడా ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని దీనంగా అర్థించారు. ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకోవాలని చేతులెత్తి వేడుకున్నారు. ఎంతో ఆశతో డ్యూటీకి వచ్చిన తమకు నిరాశే ఎదురైందని మహిళా కార్మికులు కన్నీళ్లపర్యాంతమయ్యారు.