కరోనా ప్రభావం ఆర్టీసీపై పడింది. అద్దె బస్సులకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల అద్దె బస్సుల యజమానులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల పైచిలుకు బస్సులున్నాయి. వీటితోపాటు సుమారు 2,800 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుని నడుపుతోంది. అద్దెకు తీసుకున్న బస్సులకు అవసరమైన డీజీల్‌ను ఆర్టీసీ అందజేయటంతోపాటు.. ఒక్కో బస్సుకు నెలకు సుమారు లక్ష రూపాయల అద్దె చెల్లిస్తుంది.
అద్దె బస్సులకు కండక్టర్లను ఆర్టీసీనే నియమిస్తుంది. యజమానులు ఒక్కో బస్సుకు ఇద్దరేసి డ్రైవర్లను నియమించుకోవాలి. ఒక్కో డ్రైవర్‌కు రూ.16 వేల జీతం చెల్లిస్తామని.. బస్సు నిర్వహణ కోసం ప్రతి 80 కిలోమీటర్లకు రూ.20వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని యజమానులు చెబుతున్నారు. తమకు మిగిలేది తక్కువేనని వాపోతున్నారు.
నెలరోజుల్లోపే లాక్డౌన్
గత ఏడాది అక్టోబర్ 22, 26 తేదీల్లో 13 వందల అద్దె బస్సులకు ఆర్టీసీ నోటిఫికేషన్ ఇచ్చింది. టెండర్లు దక్కించుకున్న వారు.. బస్సులు కొనుగోలు చేసి రోడ్డుపైకి తెచ్చేసరికి ఫిభ్రవరి రెండో వారం పూర్తయింది. అందులో 800 బస్సులు రోడ్డెక్కిన నెలరోజుల్లోపే లాక్డౌన్ వచ్చింది.
ఆర్టీసీ కార్మికులు 53 రోజులు సమ్మె చేసిన సమయంలో అద్దె బస్సుల యజమానులే ఆర్టీసీ యాజమాన్యానికి అండగా నిలిచారు. కానీ.. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న తమను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలల నుంచి అద్దె చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. అద్దె బస్సులు తిప్పినా కేవలం 20 శాతం మాత్రమే తిప్పుతున్నారని వాపోతున్నారు. ఒప్పందం ప్రకారం తమకు అద్దె చెల్లించాలని అద్దె బస్సుల యజమానులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం