తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం - telangana varthalu

ఆర్టీసీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బస్సులను శానిటైజేషన్ చేసినా, కొవిడ్ నిబంధనలు పాటించి బస్సులను తిప్పినా... ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడంలేదు. కొన్ని ప్రాంతాల్లో ట్రిప్పులను సైతం తగ్గిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోవడం వల్ల ఆర్టీసీ ఆదాయం ఘననీయంగా తగ్గిపోయింది. కరోనా రెండో దశ ఉద్ధృతితో ఆర్టీసీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఉద్యోగుల జీతాలకు కూడా కటకట ఏర్పడింది.

rtc loses continue
ఆర్టీసీపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం

By

Published : Apr 22, 2021, 7:13 PM IST

లాక్​డౌన్ తర్వాత తిరిగి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఆర్టీసీకి కలిసి వచ్చింది. ఎక్కువ మంది ప్రజలు ఆర్టీసీలో ప్రయాణించారు. కరోనా రెండో దశ ఉద్ధృతితో ప్రజలు ప్రయాణాలు తగ్గించుకుంటున్నారు. ఫలితంగా బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయింది. 20 రోజుల క్రితం వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను 35 లక్షల కిలోమీటర్ల వరకు తిప్పేవారు. కరోనా సెకండ్ వేవ్​తో ఆర్టీసీ బస్సులను కేవలం 30లక్షల కిలోమీటర్లకు మాత్రమే తిప్పుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 9,754 బస్సులు ఉన్నాయి. వీటిలో 6,579 ఆర్టీసీ బస్సులు, 3,175 అద్దె బస్సులు ఉన్నాయి.

సెకండ్​ వేవ్​తో మరింత నష్టం

లాక్​డౌన్ తర్వాత ఆర్టీసీకి ఘననీయంగా ఆదాయం పెరిగింది. రోజుకి రూ.9 నుంచి 10 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ఆదాయం రూ.8కోట్లకు పడిపోయింది. దీంతో ఆర్టీసీకి రోజుకు సుమారు కోటి నుంచి రెండు కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఓఆర్ కేవలం 50 శాతం మాత్రమే వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. బస్సుల్లో 50శాతం మాత్రమే ప్రయాణిస్తున్నారు. 2018-19లో రూ.928 కోట్లు, 2019-20లో రూ.1,002 కోట్లు, 2020-21 నవంబర్ వరకు రూ.1,786 కోట్లు నష్టాలు వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు సెకండ్ వేవ్​తో మరింత నష్టం వాటిల్లుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్మిక సంఘాలు అభ్యంతరం

కరోనా సెకండ్ వేవ్​లో పొరుగున ఉన్న రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయినప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటకలకు ఆర్టీసీ బస్సులను తిప్పుతున్నారు. మహారాష్ట్రకు 100 బస్సులను, కర్ణాటకకు 200 బస్సులను తిప్పుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... బస్సులను తిప్పుతున్నామని పేర్కొంటున్నారు. కానీ కార్మిక సంఘాలు మాత్రం కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సులను తిప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్​ చేసిన ఏపీ ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details