తెలంగాణ

telangana

ETV Bharat / state

RTC: లాక్​డౌన్​తో తీవ్ర నష్టాల్లోకి ఆర్టీసీ... ప్రజారవాణాపై కరోనా ప్రభావం - rtc news

ప్రజా రవాణాపై కరోనా(Corona) తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌(Lockdown)తో ఆర్టీసీ(RTC) రోజుకు రూ. 10 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయింది. వేసవి సీజన్‌లో విహార యాత్రలు, తీర్థయాత్రలతోపాటు వివాహాలకు పెద్ద సంఖ్యలో బస్సులను బుక్‌ చేసుకోవటం, ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు వచ్చేవి. గతేడాది, ప్రస్తుతం లాక్‌డౌన్లు... వేసవిలో రావడం వల్ల ఆర్టీసీ (RTC) భారీగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. గడిచిన 20 రోజుల్లో సుమారు రూ. 200 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు యాజమాన్యం అంచనా వేస్తోంది.

RTC
ఆర్టీసీ

By

Published : Jun 1, 2021, 4:52 AM IST

నిత్యం ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ (RTC) మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపోతోంది. కరోనా రూపంలో ఆదాయానికి భారీగా గండిపడింది. ఈ ఏడాది ప్రారంభంలోఆర్టీసీ (RTC)కి రోజుకు సుమారు రూ. 11 కోట్ల వరకు ఆదాయం సమకూరేదని అధికారులు పేర్కొన్నారు. కరోనా రెండో దశ కొనసాగుతున్న తరుణంలో సైతం రూ. 4 నుంచి 5 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ లాక్‌డౌన్(Lockdown) ప్రారంభమైన మే 12 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి.

20 రోజుల్లో రూ. 200 కోట్ల నష్టం...

లాక్‌డౌన్(Lockdown) మొదటి రోజు కేవలం రూ. 50 లక్షల వరకే ఆదాయం సమకూర్చుకోగలిగింది. లాక్‌డౌన్ విరామ సమయం కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉండడంతో దూర ప్రాంతాల బస్సులను తిప్పలేకపోయింది. ఆర్టీసీ (RTC)కి ఎక్కువ ఆదాయం వచ్చేది వేసవికాలమే. ఈ సీజన్‌లో విద్యార్థులకు సెలవులు ఉండడంతో ఎక్కువగా కుటుంబాలు విహార, తీర్థయాత్రలకు వెళుతుంటారు. గతేడాది, ఈ ఏడాది ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌(Lockdown) వల్ల సంస్థ ఆదాయాన్ని కోల్పోయినట్లైందని అధికారులు పేర్కొన్నారు. మే 12 నుంచి లాక్‌డౌన్ అమలవుతుండగా... 20 రోజుల్లో రూ. 200 కోట్ల వరకు ఆదాయం కోల్పోయినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.

కలిసొచ్చేనా...

ప్రస్తుతం లాక్‌డౌన్(Lockdown) విరామ సమయాన్ని నాలుగు గంటల నుంచి రెట్టింపు సమయం చేయడంతో కలిసొస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,500 బస్సులను తిప్పగా రెట్టింపు బస్సులు తిప్పేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 8 గంటల సమయంలో ఎంతవరకు బస్సులు తిప్పగలుగుతుందో అంతవరకు తిప్పనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటికే డిపోలవారీగా ఎక్కడెక్కికి బస్సులు తిప్పాలో వాటికి సంబంధించిన వివరాలు తెప్పించుకుంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సులు తిప్పనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్‌ ఆర్టీసీ ఈడీ (RTC ED) వెంకటేశ్వర్లు తెలిపారు. బస్సులను ఎక్కువగా తిప్పడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఆరేళ్లలో రూ. 450 కోట్ల నష్టం...

ఆర్టీసీ (RTC)కి గడిచిన ఆరేళ్లలో ఏటా సుమారు రూ. 450 కోట్ల మేర నష్టాలు వాటిల్లాయి. గతేడాది ఏప్రిల్‌, మే నెలలో లాక్‌డౌన్ ఉండడం వల్ల బ‌స్సులు డిపోల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. సరిగ్గా ఈ ఏడాది సైతం మే నెలలోనే లాక్‌డౌన్ విధించడం వల్ల భారీగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. రోజుకి రూ. 10 కోట్ల చొప్పున 20 రోజులకు రూ. 200 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ విరామం పెంచడం వల్ల తిరిగి ఆదాయం పెరిగే అవకాశముందని ఆర్టీసీ (RTC) అంచనా వేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details