తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ దెబ్బకు రూ.50లక్షలకు పడిపోయిన ఆదాయం

రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆ సంస్థ లాక్​డౌన్​తో మరిన్ని నష్టాల్ని మూటగట్టుకుంటోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే బస్సులు తిప్పడం, కరోనా భయంతో బస్సు ఎక్కేవారు తగ్గటంతో ఆదాయం భారీగా పడిపోయింది.

నష్టాల్లోకి ఆర్టీసీ
నష్టాల్లోకి ఆర్టీసీ

By

Published : May 15, 2021, 6:44 PM IST

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్​డౌన్ అమలు చేస్తోంది. ఈ లాక్​డౌన్​ ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి శాపంగా మారింది. కేవలం నాలుగు గంటలు మాత్రమే బస్సులు తిరగడానికి అనుమతి ఉండటంతో ఆదాయం భారీగా పడిపోయింది.

గత నెలలో రూ.4 కోట్ల ఆదాయం

ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మాసంలో ఆర్టీసీ 8 వేల పైచిలుకు బస్సులను నడిపించటంతో రోజుకు రూ.13 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా రెండో దశ వేగంగా విస్తరించటంతో ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేసింది. దీంతో ఏప్రిల్ మాసంలో రూ.4 కోట్ల మేర ఆదాయం పడిపోయింది. లాక్​డౌన్ విధించటంతో ఒక్కసారిగా బస్సుల సంఖ్యను కుదించారు.

భారీగా తగ్గిన ఆదాయం

దీంతో ఆదాయం రూ.50-రూ.60 లక్షలకు తగ్గిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో గతంలో 2,700 పైచిలుకు బస్సులు నడిచేవి. రాత్రి కర్ఫ్యూ విధించటంతో 1700 బస్సులు మాత్రమే నడిచాయి. తాజాగా లాక్​డౌన్​తో 600 సిటీ బస్సులు మాత్రమే తిప్పారు.

గ్రేటర్​లో 450 బస్సులు మాత్రమే

ఇందులో జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బందికి 150 బస్సులను తిప్పుతున్నారు. ఇవిపోను గ్రేటర్​లో కేవలం 450 బస్సులను నాలుగు గంటలపాటు తిప్పుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న సంస్థకు లాక్​డౌన్ మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని అధికారులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రాల్లో 67శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి

ABOUT THE AUTHOR

...view details