RTC Land Issue In Bapatla: బాపట్ల ఆర్టీసీ స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన ఆర్టీసీ డీఎం శ్రీనివాసరెడ్డి బదిలీ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడేందుకు యత్నించిన డీఎం శ్రీనివాసరెడ్డిని ఉన్నతాధికారులు, ప్రభుత్వం ప్రశంసించాల్సిందిపోయి.. ఆయన చేసిన పనే పెద్ద నేరంగా పరిగణిస్తూ ఆ పోస్టు నుంచి తప్పించి, ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.
ఈ వ్యవహారంపై ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1990లో బాపట్లలో ఏపీఐఐసీ నుంచి ఆర్టీసీ 10.62 ఎకరాలను కొనుగోలు చేసింది. ఇందులో 6.54 ఎకరాల్లో గ్యారేజీ నిర్మించగా.. మిగిలిన 4.08 ఎకరాలను భవిష్యత్తు అవసరాల కోసం అట్టిపెట్టుకుంది. ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని వెనక్కి తీసుకుంటామంటూ 2003లో ఏపీఐఐసీ ఆర్టీసీకి నోటిసులిచ్చింది. వివిధ పన్నులు, నిర్వహణ వ్యయం తదితరాలు మినహాయించి రూ.3వేల చెక్కును ఆర్టీసీకి ఇచ్చింది.
అయితే భవిష్యత్తు అవసరాలకు ఆ స్థలం కావాలంటూ ఏపీఐఐసీ ఇచ్చిన ఆ చెక్కును ఆర్టీసీ వెనక్కి పంపింది. అప్పటి నుంచి ఆ భూమి సాంకేతికంగా తమ పరిధిలోనే ఉందని ఆర్టీసీ భావించింది. అయితే ఈ స్థలంలోని రూ.16 కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని ముప్పై మూడున్నరేళ్లకు వైసీపీ కార్యాలయానికి లీజుకిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏడాది కేవలం రూ. 1000 నామమాత్రపు అద్దె చెల్లించేలా విలువైన స్థలాన్ని అప్పనంగా అప్పగించేసింది.