ఆర్టీసీ ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలను విస్తృతం చేస్తున్నామని, వివిధ జిల్లాల్లోని ముఖ్య పట్టణాల్లోనూ హోండెలివరీ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమైన ఈ సేవలను తాజాగా ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
వినియోగదారుడు కోరితే..
బెంగళూరు నగరంలోని 10 ప్రాంతాలకు హోం డెలివరీ, పికప్ సేవల్ని విస్తరించినట్టు చెప్పారు. జిల్లాల్లో పార్సిల్, కార్గో సేవలు ఇప్పటివరకు బస్టాండు నుంచి బస్టాండు వరకే ఉన్నాయని తెలిపారు. ఇకపై ఎంపిక చేసిన ముఖ్య పట్టణాల్లో వినియోగదారుల ఇళ్లు, షాపుల వరకూ ఆయా సామగ్రిని అందించేలా చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. వినియోగదారుడు బుకింగ్ సమయంలో హోం డెలివరీ కోరితే ఆ మేరకు అందించేలా ఏజెన్సీలతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుందని స్పష్టం చేశారు.