తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 11:25 AM IST

ETV Bharat / state

అత్యవసర సేవలకే ఆర్టీసీ!.. సామాన్య సేవలకు మరింత సమయం

అందరి సేవలు తీర్చే ఆర్టీసీ సిటీ బస్సులు ఇకనుంచి అత్యవసర సేవలకే పరిమితమయ్యాయి. కరోనా నేపథ్యంలో అత్యవసర సేవలు, అద్దె ప్రయాణాలు, ప్రభుత్వ ఉద్యోగుల తరలింపునకే వినియోగించనున్నాయి. అయితే సామాన్యులకు సిటీ బస్సు ప్రయాణాలు ఎప్పటి నుంచి ప్రారంభమౌతాయంటే.. ఆర్టీసీ అధికారులు నోరు మెదపడంలేదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు బస్సులు నడుపుతామని చెబుతున్నారు.

అత్యవసర సేవలకే ఆర్టీసీ!.. సామాన్య సేవలకు మరింత సమయం
అత్యవసర సేవలకే ఆర్టీసీ!.. సామాన్య సేవలకు మరింత సమయం

అందరి ప్రయాణ అవసరాలు తీర్చే ఆర్టీసీ సిటీ బస్సులు ఇప్పుడు కేవలం అత్యవసర సేవలకే పరిమితమయ్యాయి. ప్రతిరోజు 10 లక్షల కిలోమీటర్లు తిరిగి.. 33 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే సిటీ బస్సులు.. దాదాపు మూడు నెలలుగా బస్సు డిపోలకే పరిమితమయ్యాయి. ఇదే సమయంలో అత్యవసర సేవలు, అద్దె ప్రయాణాలు, ప్రభుత్వ ఉద్యోగుల తరలింపునకే పరిమితమవుతున్నాయి. సామాన్యులకు సిటీ బస్సు ప్రయాణాలు ఎప్పటి నుంచి ప్రారంభమౌతాయంటే.. ఆర్టీసీ అధికారులు నోరు మెదపడంలేదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు బస్సులు నడుపుతామని చెబుతున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకూ బస్సులు తిరిగే అవకాశం లేదనే సంకేతాలు గ్రేటర్‌హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌లో కనిపిస్తోంది.

ఆది నుంచి ఆ సేవలకు..

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి లాక్‌డౌన్‌ విధించిన మరుసటి రోజు నుంచే గ్రేటర్‌హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ సేవలు మొదలయ్యాయి. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలందిస్తున్న వైద్యులతో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఇతర సిబ్బందిని తరలించేందుకు మొదటిగా ఆర్టీసీ సిటీ బస్సులు రోడ్డెక్కాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించడానికి ఉపయోగపడ్డాయి. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందితో పాటు.. పర్యవేక్షకులను, ఉద్యోగులను తరలించేందుకు ఆర్టీసీ సిటీ బస్సులే ప్రయాణ వనరయ్యాయి. ఇలా ప్రతిరోజు వైద్య రంగానికి, జీహెచ్‌ఎంసీకి కలిసి 84 బస్సులను నడుపుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు..

నగరంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. ప్రైవేటు కార్యాలయాలన్నీ పని చేస్తున్నాయి. అయితే ఆర్టీసీ సిటీ బస్సుల సేవలు ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితమయ్యాయి. పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులకు 75 బస్సుల వరకూ నడుస్తున్నాయి. వీటికి తోడు విమానాశ్రయంలో దిగే ప్రయాణికుల కోసం మొత్తం 20 మెట్రో లగ్జరీలు అందుబాటులో ఉన్నాయి. మొత్తమ్మీద 244 బస్సులు నగరంలో ప్రతి రోజూ రోడ్డెక్కుతున్నాయి. ఐటీ సంస్థలకు కూడా బస్సులు తిప్పడానికి ఆర్టీసీ సిద్ధమైనా.. కరోనా విజృంభిస్తున్న వేళ.. మరో మూడు నాలుగు నెలలు వర్కు ఫ్రమ్‌ హోమ్‌కు అనుమతిచ్చాయి. ప్రజారవాణా ప్రారంభమైనా.. ఐటీ సంస్థలు కార్యాలయాలు తెరవడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. తర్వాత కూడా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తాయని ఆర్టీసీ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో సామాన్యులకు బస్సులు గగనమయ్యే పరిస్థితి నగరంలో నెలకొంది.

అద్దెకు బస్సులు సిద్ధం..

కరోనా విజృంభిస్తున్న సమయంలో సిటీ బస్సులు నడపడానికి వెనుకా ముందవుతున్న వేళ.. అద్దెలకు బస్సులు తిప్పడమే శ్రేయస్కరం అని ఆర్టీసీ భావిస్తోంది. నెల అయ్యేసరికి అద్దె మొత్తం కచ్చితంగా వస్తుంది. అలాగే సిటీ బస్సుల్లో పరిమిత సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వీలవుతుంది. ఇలా ఈసీఐఎల్‌, హెచ్‌ఎంటీ, బీడీఎల్‌ సంస్థలకు ఇప్పటికే 65 బస్సులను నడుపుతోంది. ఇలా ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా.. ప్రైవేటు కంపెనీలైనా బస్సులు కావాలంటే ఆయా డిపో మేనేజర్లను సంప్రదిస్తే వెంటనే బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది.

ఇవీ చూడండి:కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details