తెలంగాణ

telangana

ETV Bharat / state

CORONA EFFECT: యాభై శాతం ఆదాయం కోల్పోయిన ఆర్టీఏ - తెలంగాణ వార్తలు

కరోనా మహమ్మారి ఆర్టీఏపై ప్రభావం చూపింది. రెండో దశతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు సగం వరకు తగ్గాయి. ఏటేటా పెరిగే అమ్మకాలు... కొవిడ్ కారణంగా తగ్గిపోయాయి. థర్డ్‌వేవ్‌ ప్రభావం ఉండకపోతే.. మళ్లీ వాహనాల అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

CORONA EFFECT on RTA, RTA REVENUE LOST
ఆర్టీఏపై కరోనా ప్రభావం, కరోనాతో తగ్గిన ఆర్టీఏ ఆదాయం

By

Published : Jul 19, 2021, 9:04 AM IST

కరోనా కాలంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం పడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే నగరంలో ఈ ఏడాది అమ్మకాలు దాదాపు 50 శాతం వరకు తగ్గాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నగర పరిధిలో 2 లక్షల వరకు వాహనాలు అమ్ముడు పోగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్షకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌లతో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రజలంతా ఇళ్లకు పరిమితమయ్యారు. సాధారణంగా నగరంలో అమ్మకాలు ఏయేటికాయేడు పెరుగుతుంటాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా నిత్యం 2 వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయి. ఇప్పటికే అరకోటి పైనే వాహనాలు నగర రహదారులపై తిరుగుతున్నాయి.

రెండో దశ ప్రభావం

ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత నెల రోజులపాటు లాక్‌డౌన్‌ విధించారు. ఈ ప్రభావం కొత్త వాహనాల అమ్మకాలపై పడింది. తొలి విడతలో కరోనా కేసులు తగ్గడంతో అమ్మకాల్లో కొంత పురోగతి కన్పించడంతో ఊపిరి పీల్చుకునేలోపు.. మళ్లీ రెండో విడతలో కరోనా విజృంభించడంతో పరిస్థితి మొదటికే వచ్చింది. తాజాగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు రహదారులపై జనం రద్దీ పెరిగింది. షోరూంల్లో కూడా వాహనదారుల సందడి కన్పిస్తోంది. థర్డ్‌వేవ్‌ ప్రభావం ఉండకపోతే.. మళ్లీ వాహనాల అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని రవాణాశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.

వ్యక్తిగత వాహనాలపై ఆసక్తి..

కరోనాతో చాలామంది ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు నగరంలో అన్ని రకాల కలిపి 6,887 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది అదే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 22,731 అమ్మకాలు జరిగాయి. లాక్‌డౌన్‌ విధించే వరకు అమ్మకాలు జోరుగా సాగాయి. వైరస్‌ ప్రభావంతో చాలామంది బస్సులు, ఆటోల్లో ప్రయాణించడం తగ్గించి వ్యక్తిగత వాహనాలను ఎంచుకున్నారు. ఎంఎంటీఎస్‌, మెట్రో, బస్సు సర్వీసులు తగ్గిపోవడంతో వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యం లభించింది. చాలా షోరూంలు సులభవాయిదా పద్ధతిలో వాహనాలను అందించడంతో వాహనదారులు ఆసక్తి చూపించడానికి మరో కారణం. రెండో విడత కేసులు భారీగా విజృంభించడంతో పాటు టీకా కార్యక్రమం ఊపందుకుంది. దీంతో మూడో విడత ప్రభావం అంత ఎక్కువ కనిపించకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ వాహనాల క్రయ విక్రయాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో అమ్మకాల్లో జోష్‌

  • 1.4.2020 నుంచి 31.3.2021 వరకు అమ్మకాలు (అన్ని తరహా వాహనాలు కలిపి) 1,06,001
  • గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు రిజిస్ట్రేషన్లు 6887
  • ఈఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు రిజిస్ట్రేషన్లు 22731

ఇదీ చదవండి:రాష్ట్రంలో త్వరలో 'తెలంగాణ దళిత బంధు' పథకం అమలు

ABOUT THE AUTHOR

...view details