తెలంగాణ

telangana

ETV Bharat / state

అదరగొట్టిన RTA... రికార్డు స్థాయిలో బకాయిల వసూళ్లు - Telangana crime news

RTA Tax Collections increased in Telangana: పేరుకుపోయిన బకాయిల వసూళ్లపై రవాణా శాఖ కొరఢా ఝుళిపించింది. వాహనదారులు తమంతట తాము ట్యాక్స్‌ చెల్లిస్తే.. 50 శాతం అపరాధ రుసుముతో వదిలేస్తామని.. లేకుంటే రెండు వందల శాతం వసూలు చేస్తామన్న హెచ్చరికలతో పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే 61 శాతం అధికంగా ట్యాక్స్‌ వసూలైనట్లు అధికారులు వివరించారు.

rta
rta

By

Published : Apr 3, 2023, 10:54 AM IST

RTA Tax Collections increased in Telangana: కొన్నినెలలుగా పేరుకుపోయిన బకాయిల వసూళ్లకు రవాణా శాఖ అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. 2021-22లో రూ.3 వేల 971.38 కోట్ల ఆదాయం వస్తే 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ.6 వేల 390.80 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంటే గతేడాదితో పోలిస్తే 61 శాతం అధికంగా ఆదాయం సమకూరిందని వివరించారు. పన్నులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారుల కోసం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకు అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఆ డ్రైవ్‌ వల్ల రికార్డు స్థాయిలో వసూలైనట్లు వివరించారు.

"త్రైమాసిక పన్ను కట్టకుండా రోడ్లపై తిరిగే దాదాపు 16,000 వాహనాలను హైదరాబాద్​లో గుర్తించాం. వాటన్నింటి నుంచి ట్యాక్స్​ కట్టించాలని లక్ష్యంగా హైదరాబాద్​లో ఆరు బృందాలను ఏర్పాటు చేశాం. ఒక్కో బృందంలో నలుగురి నుంచి అయిదుగురు మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్లు ఉన్నారు. వీరందరూ ఆర్​టీవో ఆధ్వర్యంలో పని చేస్తుంటారు. ఇప్పటికే 4758 కేసులు నమోదు చేశాం. కేసులు నమోదైన వారు స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తే.. 50 శాతం అపరాధ రుసుముతో వదిలేస్తాం. లేకుంటే రెండు వందల శాతం పన్ను వసూలు చేస్తాం".-పాండు రంగానాయక్,​ హైదరాబాద్ సంయుక్త రవాణా శాఖ అధికారి

క్యాబ్​ల యజమానులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నా.. కేసులు నమోదు చేస్తున్నారని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారులను పట్టించుకోవటం లేదని ట్యాక్స్ అసోసియేషన్ ఆరోపించింది. హైదరాబాద్​లో దాదాపు ఇరవై వేల పైచిలుకు వాహనాలు అనుమతి లేకుండా నడుపుతున్నారు. వారి వల్ల తమ జీవనోపాధికి గండిపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

"తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాలంటే.. మేము రూ.6 వందల బోర్డరింగ్​ పాస్​ తీసుకోవాలి. రవాణా శాఖకు ప్రతి సంవత్సరం సక్రమంగానే ట్యాక్స్​ చెల్లిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయడం లేదు. వేరే రాష్ట్రాల నుంచి దాదాపు 20000 వేల పైచిలుకు వాహనాలు వచ్చి తెలంగాణలో ఎటువంటి అనుమతి లేకుండా తిప్పుతున్నారు. దీని వల్ల మా ఆదాయానికి గండి పడుతోంది. వారు రవాణా శాఖ వారికి పన్ను చెల్లిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అక్రమంగా తిప్పుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి." -మీసాల సాయిబాబు, ట్యాక్స్ అసోసియేషన్ నేత

వాహనదారులు సకాలంలో పన్నులు చెల్లిస్తే... ఎలాంటి అపరాధ రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

అదరగోట్టన ఆర్​టీఏ... రికార్డు స్థాయిలో బకాయిల వసూళ్లు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details