RS Praveen Kumar Respond on Hakimpet Sports School Incident : ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గంలో కొనసాగుతున్న.. క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీలను తక్షణమే బర్తరఫ్ చేయాలని.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) డిమాండ్ చేశారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపులపై.. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నారు. దిల్లీ తరహాలో మన రాష్ట్రంలో కూడా.. బ్రిజ్ భూషణ్లున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు.
RS Praveen kumar comments on KCR : దళిత బంధు పథకంలో కమీషన్లు
ఈ క్రమంలోనే ఓ వెటర్నరీ డాక్టర్ అయిన హరికృష్ణను.. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో (Hakimpet Sports School) ఎలా స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. పశుసంవర్థక శాఖ నుంచి ఆయనను.. క్రీడా శాఖకు ఎలా బదిలీ చేశారని? అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడని.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు డిప్యూటేషన్ ఇచ్చారని ఆరోపించారు. హరికృష్ణపై ప్రభుత్వం సిట్ వేసి.. లైంగిక వేధింపులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ప్రధాన అనుచరుడైనందుకే.. అతడిని ప్రభుత్వం కాపాడుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జల్పల్లి మున్సిపాలిటీలో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న.. సామాజిక కార్యకర్త షేక్ సయీద్ బావజీర్‌ను బండ్లగూడలో హత్య చేయడం దారుణమన్నారు. మున్సిపాలిటీలో జరిగే అవినీతి, అక్రమాలను సామాజిక మాధ్యమాల్లో బయటపెట్టినందుకే.. కొందరు వ్యక్తులు అతడిని చంపారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.