ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేసిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని... పదవీ విరమణకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు నెలల ముందుగా నోటీస్ ఇవ్వాలన్న నిబంధనను ప్రభుత్వం మినహాయించింది. ప్రవీణ్ కుమార్‌ను ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పేదలకు సేవచేసేందుకే..
పేద ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద విరమణ దరఖాస్తు చేసుకున్నట్లు గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సూర్యుడు పడమర నుంచి ఉదయిస్తాడనేది ఎంతో తప్పో.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతే తప్పని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల అభివృద్ధే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందన్నారు.