RS praveen Kumar comments on KCR : రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు మార్చాల్సింది మహానీయులు రచించిన భారత రాజ్యాంగాన్ని కాదని... వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేస్తున్న వర్గాలకు ప్రతినిధిగా ఉన్న కేసీఆర్ లాంటి నాయకులనంటూ విమర్శించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
కేసీఆర్ ఏమన్నారంటే...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్, భాజపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యానించారు.
'దేశంలో రాజ్యాంగాన్ని ఇప్పటికి 80 సార్లు సవరించారు. దేశాన్ని బాగు చేయడానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉంది. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చాయి. మన దేశంలోనూ అది జరగాలి. ప్రపంచంలోనే వివిధ వనరులతో అత్యంత శక్తిమంతమైన దేశంగా..నీళ్లు అందుబాటులో ఉన్నా సాగు, తాగునీరు అందట్లేదు. విద్యుత్ ఉన్నా 65 శాతం దేశ ప్రజలు అంధకారంలో ఉన్నారు. ఎంతకాలం దేశ ప్రజలను అంధకారంలో ఉంచుతారు. దేశంలో మార్పు తీసుకురావాలని ప్రజలను కోరుతున్నా. దీని ద్వారా భారత్ అగ్రదేశంగా మారవచ్చు. ఇప్పటివరకు దేశ పాలనలో కాంగ్రెస్, భాజపాలు విఫలమయ్యాయి.'