- నల్లకుంటకు చెందిన వినియోగదారుడి ఫ్లాట్‌కు ఈనెల రూ.48,316 బిల్లు వేశారు. 39 రోజులకు 5234 యూనిట్లు వినియోగించారని చూపించారు. వాస్తవానికి కొద్దికాలంగా ఖాళీగా ఉన్న ఈ ఇంటికి కనీస బిల్లే వస్తోంది. ఈనెల ఏకంగా అర లక్ష వచ్చింది.
- సరస్వతి నగర్‌కు చెందిన మరో వినియోగదారుడికి ఈనెల రూ.10,252 బిల్లు ఇచ్చారు. 35 రోజులకు 1233 యూనిట్లు కాల్చాడని పేర్కొన్నారు. గత బిల్లులు చూస్తే అతనికి ప్రతి నెలలోనూ రూ.500 నుంచి రూ.700 మధ్యే బిల్లు వచ్చింది. ఈనెల అమాంతం పెరిగిపోవడం గమనార్హం.
విద్యుత్తు మీటర్లలో లోపాలు వినియోగదారుల్లో దడ పుట్టిస్తున్నాయి. రూ.వేలు, రూ.లక్షల్లో వస్తున్న బిల్లులు చూసి షాకవుతున్నారు. కొన్నిసార్లు రీడింగ్ నమోదులో సాంకేతికత లోపాలతో అధిక బిల్లులు వస్తుండగా.. మరికొన్నిసార్లు మీటర్లలో లోపాలు కారణమవుతున్నాయి. పాత మీటర్ల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రానిక్ మీటర్లు బిగించినా ప్రతినెల వందల సంఖ్యలో మీటర్లు మొరాయిస్తున్నాయి. వినియోగానికి మించి రీడింగ్ తిరుగుతున్నాయి. ప్రతి నెల వందల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వాటిని మీటర్ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తున్నారు. లోపాలున్న మీటర్లు తొలగించి కొత్తవి బిగిస్తున్నారు. సగటు బిల్లింగ్, బ్యాక్ బిల్లింగ్‌తో అర్థం కాని రీతిలో ఇష్టానుసారం బిల్లులు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మీటర్ రీడింగ్ ఆలస్యం పైన ఫిర్యాదులొస్తున్నాయి. 30 రోజులకు తీయాల్సిన బిల్లులు 35-39 రోజుల మధ్య తీస్తున్నారని వాపోతున్నారు.
కామన్ సర్వీసు మార్పుపై ఆలస్యం..
సాంకేతిక లోపాలు, సిబ్బంది పొరపాటు వల్ల అధికంగా వచ్చిన విద్యుత్తు బిల్లులపై ఫిర్యాదు చేసినా స్పందన ఉండటంలేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇంట్లో ఎన్ని భాగాలు(పోర్షన్లు) ఉంటే అన్ని మాత్రమే గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉండాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. మూడు భాగాలు ఉండి నాలుగు కనెక్షన్లుంటే అదనంగా ఉన్నదాన్ని కామన్‌గా మార్చేశారు. కామన్ సర్వీస్ కింద రూ.5 ఛార్జ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఇలా మార్చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. సిబ్బంది పొరపాటు చేశారని.. తర్వాతి బిల్లులో కేటగిరి మారుతుందని అధికారులు చెప్పి రెండునెలలైనా మార్చలేదు.