Telangana Regional Ring Road in Bharat mala2 project: హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు అవతలి నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు- ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల-2 ప్రాజెక్టులో చేర్చింది. ఏడాదిన్నర క్రితం నుంచి ఈ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉండగా.. ఇటీవల జరిగిన సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. డీపీఆర్‌కు కూడా అధికారులు తుది కసరత్తు పూర్తి చేశారు.
Telangana Regional Ring Road News : కేంద్రం ఆర్‌ఆర్‌ఆర్‌ను 347.80 కిలోమీటర్ల మేర ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించాలని నిర్ణయించింది. ఈ రెండు భాగాలను 22 వేల కోట్ల రూపాయలతో పూర్తిచేయాలని తొలుత అధికారులు అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం రెండు భాగాలకు కలిపి 25 నుంచి 26 వేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే నిర్మాణ వ్యయం పెరగనుంది. ఇప్పటికే ఉత్తర భాగం భూ సేకరణ తుదిదశకు చేరుకోగా.. తాజాగా దక్షిణ భాగం రహదారి ప్రతిపాదనలూ ముందుకు సాగుతున్నాయి.
భూ సేకరణ వ్యయం కొంత తగ్గినా..చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల, సంగారెడ్డి వరకు 189.20 కిలోమీటర్ల మేర దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీని నిర్మాణానికి 13 వేల కోట్ల నుంచి 14.5 వేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఈ మార్గంలో ప్రైవేటు భూములతోపాటు ప్రభుత్వ స్థలాలు ఉండటంతో భూ సేకరణ వ్యయం కొంత తగ్గినా.. నిర్మాణ వ్యయం మాత్రం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భాగం ప్రతిపాదనలను కేంద్రం ఏడాది క్రితమే సిద్ధం చేసినా.. ఉత్తర భాగం భూ సేకరణ వ్యవహారం కొలిక్కి వచ్చిన తరవాత దీన్ని ‘భారత్‌మాల-2’లో చేర్చాలని వేచి చూసింది. కేంద్రం తాజా నిర్ణయంతో దీనికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది.
సమ వ్యయం..భూ సేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంది. ఉత్తర భాగం వ్యయంలో సగం మొత్తాన్ని దశలవారీగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సుమారు 1,200 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా.. తొలుత వంద కోట్లను విడుదల చేసింది. తరవాత అవసరం మేరకు విడతల వారీగా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ అంగీకారానికి వచ్చాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఉత్తర భాగంలో తొలి విడత నిర్మించనున్న సుమారు 60 కిలోమీటర్ల మార్గం ప్రతిపాదనలను అధికారులు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.