ఆర్ఆర్ఆర్.. రౌద్రం... రణం.. రుధిరం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీస్థాయి చారిత్రక చిత్రం. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి కథతో వస్తాడోనని ఊహించిన ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ.... ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2017 నవంబర్ 18న చరణ్, తారక్‌లతో దిగిన ఫొటోను ట్విట్టర్లో పంచుకొని ఊహించని విధంగా ఆశ్చర్యపరిచారు. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ జీవిత నేపథ్యంతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అంతే.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ.. మరోసారి రాజమౌళి వైపు చూసింది.
చిరంజీవి చేతుల మీదుగా ఆర్ఆర్ఆర్ ప్రారంభం
తారక్, చరణ్‌లతో మల్టీస్టారర్ సినిమా అనగానే టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. అనుకున్నట్లుగానే కథ మొత్తం సిద్ధం చేసుకున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ హ్యాష్ ట్యాగ్‌తోనే సినిమాను మొదలుపెట్టారు. 2018 నవంబర్ 11న హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆర్ఆర్ఆర్ను లాంఛనంగా ప్రారంభించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా ప్రముఖులంతా హాజరయ్యారు. 2018 నవంబర్ 19న యాక్షన్ సన్నివేశంతో షూటింగ్‌ను ఆరంభించారు. అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిల్మ్ సిటీ, వికారాబాద్ ప్రాంతాల్లో ఏకధాటిగా షూటింగ్ జరిపారు. ఆ తర్వాత గుజరాత్, పుణే, మహాభలేశ్వరం, ఉక్రెయిన్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమాను చిత్రీకరించారు.
ఆర్ఆర్ఆర్ అర్థం వచ్చేలా టైటిల్
ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నప్పుడు అదే స్థాయిలో పేరు ఉండాలని భావించారు. మొదట్లో ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ తో సినిమాను మొదలుపెట్టారు. ప్రేక్షకులంతా అదే టైటిల్‌గా భావించారు. కానీ 2019 మార్చి 18న తమ చిత్రానికి ఆర్ఆర్ఆర్ అర్థం వచ్చేలా టైటిల్ పెట్టాలంటూ చిత్ర బృందం ప్రేక్షకులను కోరింది. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. రకరకాల టైటిల్స్ పోటెత్తాయి. చివరకు అందులో నుంచి "రౌద్రం రణం రుధిరం" పేరుతో మార్చి 25న టైటిల్ ప్రకటిస్తూ రాజమౌళి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అనూహ్యంగా రెండేళ్ల తర్వాత అదే మార్చి 25న సినిమా విడుదల అవుతుండటం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల
రాజమౌళి ఏ సినిమా చేసినా ప్రేక్షకులు సంతృప్తి పడే వరకు తీయడం అలవాటు. అందువల్లే బాహుబలి కోసం ఐదేళ్లు పట్టింది. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలోనూ కోవిడ్ కారణంగా సినిమా ఆలస్యమైంది. 2018లో మొదలైన సినిమా పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తవుతుందనుకున్న సినిమా... ఏకంగా 500 కోట్లు దాటింది. నటీనటుల పారితోషకాలు కాకుండానే ఈ స్థాయిలో బడ్జెట్ కావడం దర్శక నిర్మాతలను కలవరానికి గురిచేసింది. అయినా సినిమాపై నమ్మకంతో ఎక్కడా వెనుకడుగు వేయకుండా చిత్రాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. కరోనాతో దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా 3డీతోపాటు ఐమ్యాక్స్, డాల్బీ విజన్ ఫార్మాట్లలోనూ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల చేస్తున్నారు.