సముద్రాలు అతి వేగంగా వేడెక్కడం, అంతర్జాతీయంగా వర్షపాతంలో వస్తున్న మార్పులు, వాతావరణంపై జరుగుతున్న పరిశోధనకు నాయకత్వం వహిస్తోన్న రాక్సీ.. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించిన టాప్ టు పర్సెంట్ శాస్త్రవేత్తల్లో ఒకరు. ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(ఐపీసీసీ) విడుదల చేసిన నివేదిక తయారీలోనూ ఈయన కీలక వ్యక్తి. తరచూ సంభవిస్తున్న అతి భారీ వర్షాలు, తుపాన్ల నేపథ్యంలో వాతావరణ మార్పులు, దీని పర్యవసానాల గురించి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి ఎం.ఎల్.నరసింహారెడ్డితో ఆయన మాట్లాడారు.
హడలెత్తిస్తున్న కడలి..
అతి భారీ వర్షాలు, తరచూ తుపాన్లు రావడానికి ఎలాంటి మార్పులు కారణమవుతున్నాయి?
మంచు పర్వతాలు కరిగిపోవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల గతంలో ఎన్నడూ లేనంత వేగంగా సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా 1901-1971 మధ్య సముద్ర మట్టాలు దశాబ్దానికి 1.3 సెం.మీ పెరిగితే, 1971-2006లో అది 1.9 సెం.మీ. 2006-18 మధ్య ఇది 3.7 సెం.మీ. ఇప్పుడు పశ్చిమం నుంచి తూర్పు తీరప్రాంతం మధ్య దశాబ్దానికి మూడు నుంచి ఐదు సెం.మీ పెరుగుతోంది. బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో సముద్ర మట్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2100 నాటికి 40 సెం.మీ నుంచి ఒక మీటరు (100 సెం.మీ.)వరకు పెరగొచ్చు. తాజా ఐపీసీసీ నివేదిక ప్రకారం రెండు మీటర్ల వరకు పెరగడాన్ని కూడా తోసిపుచ్చలేం. 1950 తర్వాత ఉష్ణమండల హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం భారత భూభాగంపైన ప్రత్యేకించి కోస్తా ప్రాంతాలపైన చాలా ఒత్తిడి పెంచింది. రుతుపవనాలకు సంబంధించిన గాలుల్లో ఒడిదొడుకులూ పెరిగాయి. ఈ కారణంగా అతి భారీ వర్షాలు మూడు రెట్లు పెరిగి వరదలొస్తున్నాయి. చాలా తీవ్రమైనవి 150 శాతం పెరిగాయి. వెంట వెంటనే తుపాన్ల్లూ వచ్చే అవకాశాలున్నాయని తాజాగా ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. ఇలాంటివి భారతదేశంలో ఇప్పటికే జరిగాయి. 2021 మే నెలలో తౌక్తే, యాస్ తుపాన్లు వచ్చినపుడు ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉప్పెనలు వచ్చి నీటిని భూమి మీదకు తోశాయి. మొత్తమ్మీద దేశంలో రుతుపవనాల స్వభావం మారింది. ఎక్కువ రోజులు ఎలాంటి వర్షం లేకపోవడం, మధ్యలో మూడు నుంచి నాలుగురోజుల్లోనే అతి భారీ వర్షాలు కురవడం జరుగుతోంది.
సముద్రాల్లో ఈ పరిస్థితికి కారణమేంటి?
బొగ్గుపులుసు వాయువుల (కార్బన్‌డై ఆక్సైడ్) విడుదల పెరిగి గ్లోబల్ వార్మింగ్‌కు దారితీసింది. దీని ద్వారా వచ్చే వేడిలో 93 శాతం సముద్రాలు తీసుకొంటే...భూమి, వాతావరణం, మంచు తీసుకొనేవి ఏడు శాతం లోపు మాత్రమే. సముద్రంలో నీరు వేడెక్కడం వల్ల పగడాలు, మత్స్య సంపద కూడా అంతమవుతోంది. బంగాళాఖాతంలో నీరు ఇప్పటికే వెచ్చగా ఉండటం వల్ల ప్రతి సంవత్సరం మూడు, నాలుగు తుపాన్లు సంభవిస్తున్నాయి. బంగాళాఖాతంతో పోల్చితే చల్లగా ఉంటే అరేబియా నీళ్లు కూడా మారిపోతున్నాయి. ఫలితంగా ఇక్కడా 50 శాతం తుపాన్లు పెరిగాయి. గతంలో రెండేళ్లకు ఒక తుపాను వచ్చేది. తుపాన్లలో వేగం కూడా మారుతోంది. తౌక్తే తదితర తుపాన్లు 24 గంటల్లోపే బలహీనత నుంచి ఉద్ధృతంగా మారాయి. ఇలాంటి పరిస్థితి తుపాన్లను అంచనావేసే వారికి పెద్ద సవాలు. విపత్తుల నిర్వహణ సంస్థలకూ సంకటమే. 1970ల నుంచి ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు వేడెక్కడంతో పాటు ఆమ్లీకరణ చెందడం, ఆక్సిజన్ స్థాయులు తగ్గడం జరిగింది. 21వ శతాబ్దంలో ఇవి నాలుగు నుంచి ఎనిమిది రెట్లు పెరగ్గా, ఇది ఇంకా పెరగుతూనే ఉంది.
వరదల ప్రభావం పెరగడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందంటారా?