తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ మద్యం కేసు.. ఈడీ ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్‌ పేర్లు

delhi liquor scam
delhi liquor scam

By

Published : Feb 2, 2023, 4:14 PM IST

Updated : Feb 3, 2023, 12:04 PM IST

16:10 February 02

మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌, కవిత పేర్లు

Delhi Liquor Scam Update: దిల్లీ మద్యం కుంభకోణం అనుబంధ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్రస్తావించింది. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే... ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు ఈడీ పేర్కొంది. హోల్ సేల్ వ్యాపార సంస్థలకు 12 శాతం మార్జిన్‌ ఇచ్చి అందులో 6శాతం ముడుపుల రూపంలో వెనక్కి తీసుకొనేలా... మద్యం విధానాన్ని రూపొందించినట్లు తెలిపింది. దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే మద్యం విధానం రూపకల్పన మొదలైందని ఈడీ ఆరోపించింది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్‌ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని వెల్లడించింది.

ఇండోస్పిరిట్ యజమాని సమీర్‌మహంద్రు.. కేజ్రీవాల్‌ని విజయ్‌నాయర్ వీడియోకాల్ ద్వారా మాట్లడించినట్లు... దర్యాప్తు సంస్థ తెలిపింది. విజయ్‌నాయర్ తన కుమారుడి వంటివాడని.. అతన్ని నమ్మి ముందుకెళ్లవచ్చునని సమీర్ మహంద్రుకు... కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ తెలిపింది. విజయ్‌నాయర్‌కి ఆప్‌ నేతల మద్దతు ఉన్నట్లు ఆ విషయాన్ని బట్టి తెలుస్తోందని తెలిపింది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్ములో... కొంతమొత్తం గోవా ఎన్నికల ప్రచారంలో వాడినట్లు ఆధారాలు లభించినట్లు ఈడీ వివరించింది. సుమారు 70 లక్షలను ఎన్నికల సర్వే చేసిన వాలంటీర్లకు నగదు రూపంలో ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ప్రకటనలు, హోర్డింగులు ఇతర ప్రచారం కోసం విజయ్ నాయర్ హవాలా ద్వారా చెల్లింపులు జరిపినట్లు వెల్లడించింది.

ఆప్‌ నేతలకు 100 కోట్లు ఇచ్చారు: మద్యం కుంభకోణంలో భాగంగా సౌత్‌గ్రూప్‌ విజయ్‌నాయర్ ద్వారా... ఆప్‌ నేతలకు 100 కోట్లు ఇచ్చారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ వెల్లడించింది. కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూపులో భాగమని తెలిపింది. సమీర్ మహుంద్రుకు చెందిన ఇండోస్పిరిట్‌కు... హోల్ సేల్ డీలర్ షిప్ ఇవ్వాలని మద్యం తయారీ సంస్థ పెర్నార్డ్ రిచర్డ్స్‌ సంస్థకు విజయ్‌నాయర్ స్పష్టం చేసినట్లు పేర్కొంది. ఆ మేరకు దిల్లీ మద్యం వ్యాపారంలో ఇండో స్పిరిట్‌కు హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ దక్కింది. విజయ్ నాయర్ ఆదేశాల మేరకు ఇండోస్పిరిట్‌లో 65శాతం కవిత.... మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత 3 కోట్ల 40 లక్షలు, మాగుంట 5కోట్లు ఇండో స్పిరిట్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. కవిత తరఫున అరుణ్‌పిళ్లై, మాగుంట తరఫున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్‌లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది.

కవిత సహా 36 మంది సాక్ష్యాలు ధ్వంసం చేశారు: కవితతో సమీర్ మహుంద్రు వీడియోకాల్ మాట్లాడటంతో పాటు.. హైదరాబాద్‌లో కలిశారని చార్జిషీట్‌లో వివరించింది. కవిత ఆదేశాల మేరకు కోటి రూపాయలను... అరుణ్ పిళ్లైకి ఇచ్చినట్లు ఆమె అనుచరుడు శ్రీనివాసరావు వాంగ్మూలమిచ్చారని పేర్కొంది. మద్యం వ్యాపారంపై కవిత ఆప్ లీడర్లతో చర్చించారని.. సౌత్‌గ్రూపు ద్వారా వంద కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదిరిందని... అరుణ్ పిళ్లై చెప్పినట్లు వెల్లడించింది. దిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన చర్చల్లో కవిత పాల్గొన్నట్లు ఈడీ తెలిపింది. ఇండోస్పిరిట్​కు వచ్చిన లాభాల్లో కోటి 70 లక్షలు... మాగుంట గౌతమ్ తీసుకున్నట్లు పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వివిధ పేర్లతో ఆరు రిటైల్ జోన్లను దక్కించుకున్నట్లు తెలిపింది. కవిత సహా 36 మంది మొబైళ్లు, డిజిటల్ సాక్ష్యాలు ధ్వంసం చేశారని వివరించింది.

23న విచారణకు హాజరు కావాలని సమన్లు : కేసు దర్యాప్తులో భాగంగా 183 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిచడంతో పాటు.. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రరెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరాను అరెస్టు చేసినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అరుణ్‌పిళ్లై, బుచ్చిబాబు, ముఠా గౌతమ్, అభిషేక్ బోయినపల్లి, చందన్‌రెడ్డి, రాజ్ కుమార్, నర్సింహారావు, కె.నరేందర్ రెడ్డి, భూషన్, మనోజ్ కుమార్, వెనిశెట్టి భాస్కర్, సంజీవ్ కమార్, వి.శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాసరావు సహా పలువురిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తెలిపింది. నవంబరు 26న తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. గత నెల 6న 428 పేజీల అనుబంధ ఛార్జ్షీషీట్ దాఖలు చేసింది. అనుబంధ చార్జ్‌షీట్‌లో నిందితుల జాబితాలో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అమిత్ అరోరాతో పాటు 7 కంపెనీలను పేర్కొంది. అనుబంధ ఛార్జ్ షీట్‌ను విచారణకు స్వీకరించిన దిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈనెల 23న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 3, 2023, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details