ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన శివశంకర్, సురేష్ అన్నదమ్ములు. వీరిది ఉమ్మడి కుటుంంబం. చిన్నపాటి సిమెంటు రేకుల ఇంట్లో ఉంటున్నారు. అన్నదమ్ములకు అయిదుగురు పిల్లలు ఉన్నారు. అసలే ఇల్లు ఇరుకుగా ఉండటంతో.. పిల్లలు చదువుకోవటానికి ఇబ్బంది పడుతుండటాన్ని శివ శంకర్ గమనించాడు. పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించాలనుకున్నాడు. సొంత స్థలం లేకపోవటంతో వినూత్నంగా ఆలోచించి.. ఇంటికి ఎదురుగా ఉన్న పెద్ద చింతచెట్టుపైనే గదిని నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. ఇనుప చువ్వలు, ప్లైవుడ్లతో చిన్నపాటి గదిని సిద్ధం చేసి.. ఎండకు, వానకు ఇబ్బంది కలగకుండా, టార్పాన్ను ఏర్పాటు చేశారు. అందులో రెండు ట్యూబ్‌లైట్లు, ఒక ఫ్యాన్ అమర్చారు. చెట్టుపైకి కోతులు ఎక్కువగా వస్తుండటంతో.. పులి బొమ్మను ఉంచారు.
ఇప్పుడు తమ పిల్లలు ప్రశాంతంగా చదువుకోగలుగుతున్నారని ఆ తండ్రి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తమ చదువుకోసం తమ తండ్రి గదిని నిర్మించాడని.. శివ శంకర్ కుమార్తె ఆనందం వ్యక్తం చేస్తోంది.