రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. కుంభవృష్టికి ధ్వంసమైన రోడ్లను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్లకు మరమ్మతుల కోసం అవసరమైన నిధులపై అంచనాలు రూపొందించి... ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి నివేదిక రూపంలో అందజేశారు. రాష్ట్ర రహదారులు 4 వేల 829 కిలోమీటర్ల మేర దెబ్బతినడం వల్ల 145 కోట్ల 36 లక్షల నష్టం వాటిల్లినట్లు రోడ్డు, భవనాల శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. భారీ వర్షాల వల్ల 4 వేల 460 కిలోమీటర్ల మేర రోడ్లు కోతలకు గురయ్యాయని... వీటివల్ల 7 కోట్ల 85 లక్షలు నష్టం వచ్చిందని తెలిపారు. వీటితో పాటు వరదల వల్ల సుమారు 4 వేల 90 కిలోమీటర్ల వరకు రహదారులపై గుంతలు పడి... 4 కోట్ల 57 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి సమర్పించిన నివేదికలో వివరించారు.
అత్యధికంగా నల్గొండ జిల్లాలో...
అటు నిర్మాణంలో ఉన్న కల్వర్టులు దెబ్బతిని 52 కోట్ల 97 లక్షల మేర నష్టం వచ్చినట్లు తేల్చారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర రహదారులకు 210 కోట్ల 77 లక్షల నష్టం జరిగిందని రోడ్లు, భవనాల శాఖ ఓ అంచనాకు వచ్చింది. రాష్ట్రానికి కలిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర బృందానికి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు-వరదల వల్ల అత్యధికంగా నల్గొండ జిల్లాలో 500 కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతినగా... 19 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 96 కిలోమీటర్ల మేర రహదారులు అస్తవ్యస్తంగా తయారవడం వల్ల 3 కోట్ల 8 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు.
కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లు
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ -సుందరగిరి -సైదాపూర్ మార్గంలో 5.9 కిలోమీటర్లు... నల్గొండ జిల్లాలో హాల్య-ఆంజనేయ తండారోడ్డులో 5.5కిలోమీటర్లు మేర రోడ్డు దెబ్బతింది. ఘట్‌కేసర్ - అనాజ్‌పుర్ రోడ్డు 3.5 కిలోమీటర్లు, నల్గొండ జిల్లా తుమ్మాడం - వడ్డారగూడ మార్గంలో 2.5 కిలోమీటర్లు మేర కోసుకుపోయింది. మహబూబ్‌నగర్ - చించోలీ మార్గంలో 400 మీటర్ల రోడ్లు దెబ్బతిందని ఆర్ అండ్ బీ అధికారులు పేర్కొన్నారు.